తూర్పుగోదావరి జిల్లా ‘తుని’ ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయి నిందితులను గుర్తిస్తే అరెస్టులు చేస్తామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో నూతనంగా నిర్మించనున్న కల్యాణ మండపం, సమావేశ మందిరాలకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేతో కలసి శంకుస్థాపన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం బెటాలియన్ ఆవరణలోని మినీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... నూతనంగా ప్రతిపాదించిన అమరావతి పోలీసు కమిషనరేట్ ఉమ్మడి రాష్ట్రంలోని సైబరాబాద్ కమిషనరేట్ కంటే పెద్దదని చెప్పారు.
అమరావతి కమిషనరేట్‌కు సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ కమిషనర్‌గా వస్తారనే ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర క్యాడర్ అధికారిని ఎలా నియమిస్తామని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ పరిపాలనంతా ప్రధాన బెటాలియన్ అయిన మంగళగిరి బెటాలియన్ నుంచే జరుగుతుందన్నారు. అందువల్ల ఇక్కడి ఆరో బెటాలియన్‌లోనే ఆయుధాల నిల్వ కేంద్రంతోపాటు వాహనాల మరమ్మతులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు.
రాజధాని అమరావతిలో నక్సలైట్లు అనేది మీడియా ప్రచారమేనని కొట్టిపారేశారు. కార్యక్రమంలో బెటాలియన్స్ ఐజీ ఆర్‌కె మీనా, డీఐజీ జె.ప్రసాద్‌బాబు, పోలీసు అధికారులు కోటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు, బెటాలియన్ కమాండెంట్ బి.రాజకుమారి, గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఎస్పీ జి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.