ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్‌కు షాక్!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ను 'హస్త'గతం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందే షాక్ తగిలింది. యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు సమాచారం. నిర్మల్ ఖాత్రి రాజీనామాను హైకమాండ్ ఆమోదించినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నిర్మల్ ఖాత్రి తన రాజీనామాపై స్పందించేందుకు ఫోన్ కాల్స్‌కు కూడా అందుబాటులో లేరు. కాగా ఆయన రాజీనామా చేసిన వార్తలను ఖాత్రి సన్నిహితులు ధ్రువీకరించారు. అయితే ఖాత్రి రాజీనామాపై ఆయన కానీ, పార్టీ అధిష్టానం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నిర్మల్ ఖాత్రి జూన్‌లోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చినా, అప్పట్లో వాటిని ఆయన ఖండించారు. కాగా యూపీ నూతన సారధి కోసం కాంగ్రెస్ హైకమాండ్ వెతుకలాట ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన నేతకు పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు పార్టీ యోచిస్తోంది. ఈ సందర్భంగా యూపీలో పది నుంచి పన్నెండు శాతం దాకా ఉన్న బ్రాహ్మణ వర్గానికి దగ్గర అవ్వాలని చూస్తోంది.
ఇక యూపీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ ఇప్పుడు 28 స్థానాలకే పరిమితమైంది. అంతేకాకుండాగత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. 80 సీట్లకుగానూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాయ్ బరేలీలో సోనియా, అమేథిలో రాహుల్ మాత్రమే విజయం సాధించారు.
మరోవైపు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచార బాధ్యతలు స్వీకరించేందుకు ప్రియాంకా గాంధీ వాద్రా దాదాపుగా అంగీకరించారు. క్రమంగా పార్టీ ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంకా గాంధీ స్వీకరించాల్సిందేనని ఇటు కార్యకర్తలతో, పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 150 ర్యాలీల్లో ఆమె పాల్గొనేలా రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైపోయింది. అలాగే యూపీ సీఎం అభ్యర్థిపై కూడా పార్టీ మల్లాగుల్లాలు పడుతోంది.