బుర్హాన్ ఉగ్రవాది కాదు.. దైవభక్తుడు!
శ్రీనగర్: ఎన్ కౌంటర్ లో మరణించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని అమరవీరుడంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీర్తించడంపై భారత్ భగ్గుమంది. ఇప్పుడు జమ్ముకశ్మీర్ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు . గడిచిన 31 రోజులుగా కశ్మీర్ లో కొనసాగుతున్న ఆందోళనలకు ఆజ్యంపోసేలా.. 'వని ఉగ్రవాది కాదు, గొప్ప దైవభక్తుడు' అని పీడీపీ ఎమ్మెల్యే ముస్తాక్ అహ్మద్ షా అన్నారు. బుర్హాన్ సొంత ఊరు త్రాల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న అహ్మద్ షా.. వని గురించి తనకు అంతా తెలుసని, కశ్మీర్ లో కొనసాగుతున్న కఠినహింస, వేధింపులకు ఫలితంగా పుట్టిన ఉద్యమశక్తి బుర్హాన్ అని, అందుకే జనం అతణ్ని విపరీతంగా ప్రేమించి, గౌరవించారని పేర్కొన్నారు.
'పాలకులు కశ్మీర్ సమస్యను గాలికొదిలేసిన సందర్భంలో బుర్హాన్ వని తన మరణంతో మళ్లీ దానికి జీవం పోశాడు. దశాబ్ధాల తరబడి పోరాడుతున్న వేర్పాటువాదులకు వని తన మరణంతో కొత్త మార్గం చూపించాడు' అని అహ్మద్ షా వనీని కీర్తించారు. సోమవారం కశ్మీర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షా.. జూన్ 8 నుంచి తాను సొంత నియోజకవర్గం త్రాల్ కు వెళ్లలేకపోయానని, ఉద్రిక్త పరిస్థితులు, కర్ఫ్యూనే అందుకు కారణమని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ హయాంలో యువకులను దారుణంగా అణిచివేశారని, దానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉప్పెనే వని అని అన్నారు. ఓవైపు కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ కేంద్రంతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఆమె పార్టీకే చెందిన ఎమ్మెల్యే షా.. ఉగ్రవాదిని వెనకేసుకు రావడంతో అతనిపై చర్యలు తప్పవని పరిశీలకు భావిస్తున్నారు.
బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 60 మంది చనిపోగా, 3000 మందికి గాయాలయ్యాయి. గడిచిన 31 రోజులుగా అక్కడి 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉపశమన చర్యలకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ సానుకూల ఫలితాలు రాలేదు. ఇటు పార్లమెంట్ లోనూ కశ్మీర్ అంశం వేడిపుట్టిస్తోంది. 31 రోజుల కర్ఫ్యూ, ఆందోళనలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అయితే చర్చ జరపాలా? వద్దా? అన్నదానిపై కేంద్రం ఇంకా నిర్ణయానికి రాలేదు.