7న హైదరాబాద్లో శాంతి ర్యాలీ: కోదండరాం
తెలంగాణ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో ముల్కీ అమరవీరుల శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సిటీ కాలేజ్ నంచి ఇందిరా పార్కు వరకు శాంతి ర్యాలీ జరుపుతామని, తర్వాత ముగింపు సభ ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిందని ఆయన అంతకుముందు స్పష్టం చేశారు. విభజన తర్వాత ఎదురయ్యే సమస్యలను ఇచ్చిపుచ్చుకునే రీతిలో సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు లేనిపోని అవాంతరాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
సీఎం కిరణ్ విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు.