మెట్రో రైలా.. అబ్బే వద్దులే!
బాగా రద్దీగా ఉండటం, అనుకున్న చోటు వరకు కనెక్టివిటీ ఉండకపోవడం, సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటం.. కూర్చోడానికి కూడా స్థలం లేకపోవడం.. ఇలాంటి కారణాలతో ఢిల్లీ మెట్రో రైలుకు చాలామంది దూరంగానే ఉంటున్నారట. కాస్త ఉన్నత ఆదాయ వర్గాలు అనుకున్నవాళ్లంతా తమ వ్యక్తిగత రవాణా సదుపాయాలనే ఉపయోగించుకుంటున్నారు తప్ప.. మెట్రో రైలు జోలికి వెళ్లట్లేదు. ఈ విషయం స్వయంగా ఢిల్లీ మెట్రోరైలు వర్గాలు నిర్వహించిన సర్వేలో తేలింది. దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికులను ప్రశ్నించిన తర్వాత ఈ వివరాలు బయటపెట్టారు. మెట్రో ప్రయాణికుల్లో ఎక్కువ మంది నెలకు రూ. 20-50 వేల మధ్య జీతం వచ్చేవాళ్లే ఉంటున్నారు. ప్రయాణికులలో 50 వేల నుంచి లక్ష వరకు ఆదాయం ఉన్నవాళ్లు కేవలం 9.56 శాతం మంది మాత్రమే ఉండగా, లక్ష రూపాయలకు పైన జీతం వచ్చేవాళ్లు 1.67 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. ఏసీ బోగీలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నా కూడా వీటి జోలికి పెద్దగా రావడం లేదు. వ్యక్తిగత వాహనాలనే వాడుతున్నారు. దాంతో ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఇప్పటికే కోటి దాటింది.
మెట్రో రైలులో ప్రయాణించేవారిలో 18.4% మందికి సొంత వాహనాలున్నాయి. మెట్రో స్టేషన్ నుంచి మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లడానికి 20.23% మంది బస్సులు, 14.14% మంది ఈ-రిక్షాలు, 8.23% మంది ఆటోలు, 8.10% మంది రిక్షాలు, 3.45% మంది టాక్సీలు ఉపయోగించారు. 11.51% మంది నడవగా, కేవలం 14.31% మందే ఫీడర్ బస్సులను ఉపయోగించుకున్నారు.
ప్రధానంగా మెట్రో రైళ్లలో పీక్ అవర్స్‌లో రద్దీ చాలా ఎక్కువగా ఉండటమే దీనివైపు మొగ్గు చూపించకపోవడానికి కారణం అవుతోంది. ఉదయం 8-11, సాయంత్రం 5-8 గంటల మధ్య పీక్ అవర్స్ ఉంటున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ మెట్రో 188 రైళ్లు నడుపుతుండగా మిగిలిన సమయంలో 174 రైళ్లు నడుపుతోంది. తాను ప్రతిరోజూ నోయిడా నుంచి గుర్గావ్ వెళ్తుంటానని, మహిళల బోగీ కూడా ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుందని, అయినా అంత దూరం ప్రతిరోజూ కారులో వెళ్లడం కష్టం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే వెళ్తున్నానని మధు తివారీ అనే ప్రయాణికురాలు చెప్పారు. మెట్రో రైళ్లు ఎంత సౌకర్యవంతంగా ఉన్నా.. కారు వాడకాన్ని పూర్తిగా ఆపేసేంత పరిస్థితి మాత్రం లేదని అమిత్ భట్ అన్నారు. 2014లో 193 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ మెట్రోరైలు నెట్వర్క్.. 2016 నాటికి 212.4 కిలోమీటర్లకు విస్తరించింది. అలాగే 2014లో రోజుకు 23.5 లక్షల మంది ప్రయాణించగా, ప్రస్తుతం 28.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.