బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
పెదకాకాని(గుంటూరు జిల్లా): కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసు బృందాలు క్షేమంగా ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. పెదకాకాని మండలం నంబూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శివదుర్గ యానాదికాలనీలో ఈనెల 24న రెండేళ్ల బాలుడు జీవాను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టింది. సెల్‌టవర్ డంప్, సీసీ కెమెరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సది్వనియోగం చేసుకుని నిందితుల ఆచూకీ గుర్తించారు.
విజయవాడ వాంబేకాలనీలో నిందితులను గుర్తించిన పోలీసు బృందాలు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించాయి. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. నిందితులు రూ.1.60 లక్షలకు విక్రయించిన బాబు జీవాను, కొనుగోలు చేసినవారిని, మధ్యవర్తులుగా వ్యవహరించినవారిని వెంటబెట్టుకుని జిల్లాకు చేరారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం మూడు రోజులుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు బాబును చూపించడంతో వారి కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
సిబ్బందికి ప్రశంసల జల్లు
అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ దుర్గాప్రసాద్ నేతృత్వంలో పనిచేసిన పోలీసు బృందాలు బాబును క్షేమంగా తీసుకుని తిరిగిరావడంపై అధికారులు, ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.