వైభవంగా శ్రీవారి ధ్వజారోహణం
సాక్షి, తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా శ్రీవారి ఆలయంలో శనివారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించా రు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో వైఖానస ఆగమయోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామివారి వాహనం గరుత్మంతుడు. నిర్ణీత కొలత తో కూడిన కొత్తవస్త్రం మీద గరుడుడి బొమ్మ చిత్రీకరించారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నం లో కంకణభట్టాచార్యులు క్రతువును నిర్వహించి మంగళ ధ్వనులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు. ధ్వజారోహణంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు.
పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడి విహారం
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శనివారం రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 7.30 గంటలకు సీఎం దంపతులు ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ప్రధానార్చకుడు ఎ.వి.రమణదీక్షితులు సీఎంకు పట్టువస్త్రంతో తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. తర్వాత రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. కాగా, టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ దంపతులు శనివారం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి నాందిగా కంకణం ధరించారు.