భార్యపై భర్త హత్యాయత్నం
పెద్ద అడిశరపల్లి : అనుమానం పెనుభూతమైంది.. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు.. బంధువుల ఇంటికి తీసుకెళ్తూ మార్గమధ్యలో బీరుసీసాతో గొంతుకోసి పోలీసులకు లొంగిపోయాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలో బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ పరిధి నక్కలగండితండాకు చెందిన సబావట్ శంకర్ హైదరాబాదులో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం చందంపేట మండలం కేతెపల్లికి చెందిన వినోదను రెండోపెళ్లి చేసుకున్నాడు. శంకర్ ఒక్కడే హైదరాబాద్‌లో ఉంటుండగా వినోద నక్కలగండితండాలోనే ఉంటోంది. అప్పుడప్పుడు శంకర్ వచ్చి వెళ్తుంటాడు. ఆరు నెలల క్రితం దంపతులకు కుమారుడు జన్మించాడు.
బంధువు ఇంటికి వెళ్తూ..
శంకర్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే మంగళవారం దంపతులిద్దరూ తమ కుమారుడిని తీసుకుని పీఏపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామపంచాయతీ పరిధి మాదాలబండతండాలో నివాసముంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. కొండమల్లెపల్లిలో బస్సు ఎక్కి నల్లగొండ రోడ్డులో మైలాపురం సమీపంలో బస్‌స్టాప్ వద్ద దిగారు. అప్పటికే దంపతులిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
మద్యం మత్తులో ఉన్న శంకర్ బీరుసీసాను పగులగొట్టి వినోద గొంతులో పొడిచాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. శంక ర్ తన ఆరునెలల కుమారుడిని ఎత్తుకుని రాత్రి పది గంటల ప్రాంతంలో గుడిపల్లి పోలీస్‌స్టేషన్ వచ్చి తన భార్యను హత్య చేసినట్టు చెప్పాడు. కాగా, కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చిన వినోద నేరుగా మాదాలబండతండాకు చేరుకుంది. జరిగిన విషయాన్ని వివరించడంతో ఆమెను దేవరకొండ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. బుధవారం వినోద తండ్రి వడ్త్యా పాండు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఏ.భోజ్యా తెలిపారు.
మొదటి భార్యను కడతేర్చా..
పోలీసుల అదుపులో ఉన్న శంకర్ తనకు ఎనిమిదేళ్ల క్రితమే వివాహం జరిగిందని, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని చెప్పాడు. అనుమానంతోనే మొదటి భార్యను కూడా హత్య చేసినట్టు పోలీసులకు చెప్పాడు. అయితే మొదటి భార్య పేరు వివరాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.