అమ్మోరు తల్లికి భక్తనీరాజనం
అమ్మోరు తల్లి నామస్మరణతో ఆదివారం జిల్లా కేంద్రం అనంతపురంలోని రాంనగర్ వీధులు మార్మోగాయి. వేలాది మంది రుద్రంపేట వాసులు బోనాలు సమర్పించేందుకు కదిలి రావడంతో జాతర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాంనగర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కొలువైన పెద్దమ్మ ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉరుములు, డప్పుల హోరు నడుమ నృత్యం చేస్తూ అమ్మోరు తల్లికి భక్తి నీరాజనాలర్పించారు.
ఈ సందర్భగా నిర్వాహకులు యోగీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ మహిమాన్వితమైన పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలన్న కోరికతో మొత్తం కాలనీ వాసులందరూ తరలి వచ్చి బోనాలు సమర్పించినట్లు తెలిపారు. మధ్యాహ్నం రుద్రంపేటలో పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది. కార్యక్రమంలో రుద్రంపేట వాసులు కుళ్లాయప్ప, విష్ణుకుమార్, గోవిందరెడ్డి, వెంకటేశులు, మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
- అనంతపురం కల్చరల్