శిరమున శివుని ధరించిన విజయ రాజరాజేశ్వరి
ఎక్కడయినా సరే, శివుడి శిరస్సున గంగమ్మ ఉండటమే చూస్తాం కానీ, అమ్మవారి శిరస్సుమీద శివుడుండటం ఎక్కడైనా చూశారా? అలాగే, అక్షరాలకు ఆలయాలు కట్టి మరీ ఆరాధించడం ఎక్కడైనా చూశారా? స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు, పచ్చటి పంటపొలాలకు చేరువలో ఉన్న అతి సుందరమైన ఆలయాన్ని వీక్షించాలంటే కృష్ణాజిల్లాలోని పెదపులిపాక గ్రామానికి వెళ్లవలసిందే.
విజయవాడ సమీపంలోని యనమలకుదురు మీదుగా కట్ట మీద నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెద్దపులిపాక గ్రామం స్వాగతం పలుకుతుంది. ఒక వైపు ఎర్రటి నీటితో నిండుగా పరుగులు తీస్తున్న కాలువ. కాలువకు ఆవల కృష్ణమ్మ, మరో పక్క ఠీవిగా తలలు ఎత్తుకుని నిలబడిన చెరుకు తోటలు. ఈవల శ్రీవిజయ రాజరాజేశ్వరి దేవాలయం. మనసుకి ఆహ్లాదాన్ని, భక్తిని ప్రసాదించే ప్రశాంత వాతావరణంలో శ్రీవిజయరాజరాజేశ్వరి దేవాలయ నిర్మాణం కన్నులపండువగా ఉంటుంది.
పరమహంస పరివ్రాజకులు వాసుదేవానందగిరి స్వామివారి కృషితో పూర్తిగా దక్షిణాది శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశంలోనే విలక్షణమైనది. అమరలింగేశ్వరుడికి, బెజవాడ కనకదుర్గకు మధ్యన కృష్ణానదీ తీరంలోని పెద్దపులిపాక గ్రామంలో కొలువు తీరి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో... విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే‘విజయగణపతి’, సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే ‘విజయ సరస్వతీదేవి’, ఐశ్వర్యాలను సమకూర్చే ‘విజయలక్ష్మి’, సకల కార్యసిద్ధిని ప్రసాదించే ‘విజయ ఆంజనేయస్వామి’ మూర్తులను దర్శించుకోవడం పుణ్యదాయకం. దేవాలయ నలుదిక్కులా నాలుగు వేదాలకు ప్రతీకగా ఎత్తయిన రాజగోపుర ద్వారాలు స్వాగతం పలుకుతాయి. ఆలయానికి వాయవ్యంగా గోశాల, ప్రాకార మండపంలో శాలాహారంలో ‘అ’ నుండి ‘క్ష’ వరకు గల అక్షర దేవతలు, లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి.
ఏకశిలా విగ్రహం...
ఇక్కడి దేవి పేరు శ్రీవిజయరాజరాజేశ్వరి. అమ్మవారి శిరస్సు మీద లింగాకారం ఉంటుంది. పరమశివుడు గంగను తన శిరస్సు మీద ధరిస్తే, అమ్మవారు సాక్షాత్తు అయ్యవారిని తన శిరస్సున ధరించి కనువిందు చేస్తుంది. తల మీద ఉన్న అయ్యవారి కోసం సోమవారం, అమ్మవారి కోసం శుక్రవారం అభిషేకాలు జరిపిస్తారు. ఇది ఇక్కడి విలక్షణత. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అక్షర దేవతల్ని విగ్రహరూపంలో వాయుప్రతిష్ఠ చేశారు. దశావతారాలు, నవదుర్గలు, దశమహావిద్యల విగ్రహాలను జైపూర్లో చేయించారు. ప్రస్తుతం పౌర్ణమి నాడు మాత్రం అన్నదానం జరుగుతోంది.
అక్షరదేవతలు...
ఆలయంలోకి ప్రవేశిస్తుండగానే నలుదిక్కులా నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఎత్తయిన రాజగోపుర ద్వారాలు స్వాగతం పలుకుతాయి. ప్రాకార మండపంలో శాలాహారంలో ‘అ’ నుండి ‘క్ష’ వరకు గల అక్షర దేవతలు అక్షరభిక్ష పెడతాయి. ఎక్కడా లేని విధంగా అక్షర దేవతల్ని ఇక్కడ విగ్రహరూపంలో వాయుప్రతిష్ఠ చేశారు. ఆలయ లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు పురాణజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా నీలి సరస్వతి, చిన్నమస్తాదేవి వంటి విలక్షణ దేవతల రూపాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆలయానికి వాయవ్యంగా గోశాలలో గోమాతలు పవిత్రతతో మూర్తీభవిస్తాయి. గోశాల కుడ్యాల మీద కొలువుతీరిన అష్టలక్ష్ములు, శ్రీకృష్ణుడు భక్తిభావనలను కలిగిస్తాయి. త్వరలో ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠాపన కూడా జరగబోతోంది.
ప్రతిష్ఠాపన...
ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన 2016 ఫిబ్రవరి మాసంలో జరిగింది. మహాబలిపురంలోని ఒక పేరెన్నికగన్న శిల్పి ఈ విగ్రహాన్ని నల్లని ఏకశిలలో మూడు మాసాలు శ్రమించి రూపొందించారు. ఈ ఆలయంలో అడుగుపెడితే అంతా విజయమేనని భక్తుల విశ్వాసం.
– డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ
ఆలయ వేళలు
ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, సాయంత్రం 5 గం. నుంచి రాత్రి 8 గం. వరకు
రైలు మార్గం: విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషనులు.
బస్సుమార్గం: విజయవాడ, గుంటూరు బస్సు స్టాండుల నుంచి యనమలకుదురు వరకు వస్తే... అక్కడి నుంచి ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు. యనమలకుదురు నుంచి కేవలం మూడు కిలోమీటర్లున్న ఈ గుడిని సొంత వాహనదారులు వారి వారి వాహనాల మీద అతి సులువుగా చేరుకోవచ్చు.
దేవాలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలంటే, మరింత శ్రద్ధాభక్తులతో దేవాలయాన్ని పరిరక్షించాలి. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల ప్రతిమలు, దశావతారాల ప్రతిమలను కూడా అద్దాలతో పరిరక్షిస్తే విగ్రహాల పవిత్రత నిలబడుతుంది. ప్రతిమలను మరింతకాలం అందంగా చూసుకునే అవకాశం ఉంటుంది. దేవాలయంలో జరిగే సేవలు, పూజలు తదితర నిత్య కైంకర్యాల వంటివాటిని పవిత్రంగా ఆచరిస్తే, ఈ దేవాలయానికి మరింత పవిత్రత చేకూరుతుంది. ఇంకా నగర వాసనలు అంటని, పచ్చిగా ఉన్న పచ్చని పల్లెసీమ గాలులలో ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మికతకు నిలయంగా నిలుస్తుంది.
యనమలకుదురు, చోడవరం, తాడిగడప, పెనమలూరు ప్రాంతాలు సరిహద్దులుగా వెలసిన ప్రాంతం పెద్దపులిపాక. గ్రామానికి మధ్యన ఉన్న ‘చిన్నచెరువు’ ఆ గ్రామ ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ కాపాడుతోంది. పక్కనే ప్రవహిస్తున్న కాలువ... పంటలకు నీటిసదుపాయం కలిపిస్తోంది. విజయవాడ సమీపంలోని యనమలకుదురు కట్ట మీదుగా మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెద్దపులిపాక గ్రామం.