ఏసీబీ పంజా
పెద్దషాపూర్ (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని పెద్దషాపూర్ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం వరకు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.1,05,220 నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) కిర ణ్‌కుమార్, ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనదారులనుంచి డబ్బులు వసూలు చేయడానికి ఏజెంట్లుగా ఏఎంవీఐ డ్రైవర్ మహ్మద్ మొజాయిద్దీన్, బీహార్‌వాసి సంజయ్ కుమార్జాను నియమించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో చెక్‌పోస్టు ఆవరణలోని రెస్ట్ రూంలో ఉన్న మంచం పరుపు కింద రూ.61,000 నగదు దొరికింది. మిగతా సొమ్మును ఏజెంట్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి నుంచి ఏసీబీ దాడులు మొదలు పెట్టడంతో వాహనాల తనిఖీలకు బ్రేక్‌పడింది. శనివారం ఉదయం 9గంటల తర్వాత మళ్లీ వాహనాలను తనిఖీ చేశారు. దాడులు జరిపిన బృందంలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఇన్స్పెక్టర్లు రాజు, ముత్తులింగం, తిరుపతిరాజు, హైదరాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్లు కె.సునీల్, వెంకట్‌రెడ్డి ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును, దాడుల నివేదికను సంబంధిత శాఖకు అందజేస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.