pedestrian walkway
-
కూలీలను చిదిమేసిన రైలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమయిన వలస కార్మికులను గూడ్స్ రైలు చిదిమేసింది. కాలినడకన రైలు పట్టాల వెంబడి నడిచి వెళ్తూ అలసిపోయి పట్టాలపై పడుకున్నవారిపై నుంచి శుక్రవారం తెల్లవారు జామున ఒక గూడ్స్ రైలు దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కర్మాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్న ముగ్గురు ప్రాణాలు దక్కించుకున్నారు. మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న ఒక స్టీలు ఫ్యాక్టరీలో పని చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు గురువారం రాత్రి కాలినడకన సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. రైలు పట్టాల వెంబడి దాదాపు 40 కి.మీ.లు నడిచిన తరువాత ఔరంగాబాద్‌కు దగ్గరలో అలసిపోయి, ఆగిపోయారు. అక్కడే రైలు పట్టాలపై నిద్రించారు. ముగ్గురు మాత్రం పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్నారు. తెల్లవారు జాము 5.15 గంటల ప్రాంతంలో ఒక గూడ్స్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. రైలు రావడాన్ని పట్టాలకు దూరంగా పడుకున్నవారు గుర్తించారు. పట్టాలపై పడుకున్నవారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగా అరిచారు. కానీ, పట్టాలపై నిద్రిస్తున్నవారు ప్రమాదాన్ని గుర్తించేలోపే దుర్ఘటన జరిగిపోయింది. నాందేడ్ డివిజన్లోని బద్నాపూర్– కర్మాడ్ స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. చెల్లాచెదురుగా పడి ఉన్న వలస కూలీల మృతదేహాలు, వారి వస్తువులతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఆ దృశ్యాలున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దూరంగా పట్టాలపై మనుషులున్నట్లు గుర్తించిన రైలు లోకోపైలట్.. హారన్ మోగిస్తూ, రైలు ఆపేందుకు విఫలయత్నం చేశాడని స్థానిక మీడియా పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రైళ్లు నడవవన్న ధీమాతోనే వారు పట్టాలపై పడుకున్నారని బాధితులను ఉటంకిస్తూ వివరించింది. పోలీసులు ఆపకుండా ఉండేందుకే.. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. కార్మికులు మహారాష్ట్రలోని జల్నా నుంచి మధ్యప్రదేశ్‌లోని భుసావల్‌కు వెళ్తున్నారని ఎస్పీ మోక్షద పాటిల్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా పోలీసులు తమను అడ్డుకోకుండా ఉండేందుకే వారు రోడ్డు మార్గాలను కాకుండా, పట్టాలను అనుసరించి ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. మానవ హక్కుల కమిషన్ నోటీసులు రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో కార్మికులకు అందిస్తున్న ఆహార, వసతి, ఇతర సౌకర్యాల వివరాలను కూడా తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ప్రముఖుల సంతాపం ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి తనను కలచివేసిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు’అని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించేందుకు మరిన్ని రైళ్లు కావాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో ఆ ఏర్పాట్లు చేస్తాం’అని ఠాక్రే అభ్యర్థించారు. విపక్షాల విమర్శలు జాతి నిర్మాతలైన కార్మికులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు దేశమంతా సిగ్గుతో తలదించుకోవాలని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలని స్థానిక ఎంఐఎం ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ విమర్శించారు. ఇందుకు కారణమైన ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. -
6 గంటల్లోనే..
సనత్‌నగర్: అది ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు. అయితే అనూహ్యంగా ఆరు గంటల్లోనే పూర్తి కానుంది. ఆదివారం నుంచి స్థానికులకు అందుబాటులోకి రానుంది. రైల్వే శాఖ తాజాగా అనుమతి ఇవ్వడంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రైల్వే అధికారులు కేవలం 6గంటల్లోనే పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు శనివారం అర్ధరాత్రి ముహూర్తం ఖరారు చేశారు. ఆదివారం తెల్లవారుజాము వరకు ఆర్యూబీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ నిర్మాణం ఎక్కడో తెలుసా? బేగంపేట్–అమీర్‌పేట్ మధ్య. ఈ ఆర్యూబీ నిర్మాణం పూర్తయితే బేగంపేట్ వైపున్న ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి అమీర్‌పేట్ వైపున్న లీలానగర్‌కు కాలినడకన ఒకే ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. అంతేకాకుండా దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆర్యూబీ కేవలం పాదచారులకు మాత్రమే. దీని ద్వారా వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. సిటీలోనే తొలిసారి నిర్మిస్తున్న పెడస్ట్రియన్ ఆర్యూబీ ఇదీ. పనులు ఇలా.. శనివారం రాత్రి ఎంఎంటీఎస్ రైళ్ల సమయం ముగిసిన తర్వాత, అన్ని దూర ప్రాంత సర్వీసులు నగరాన్ని దాటిన అనంతరం.. అంటే దాదాపు రాత్రి 11:30గంటల ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారు. ఆర్యూబీ కోసం ఇప్పటికే తొమ్మిది బ్లాకులను సిద్ధంగా ఉంచారు. పనుల్లో భాగంగా ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి లీలానగర్ మధ్యలో ఉన్న రైలు పట్టాలను కట్ చేస్తారు. ఆ తర్వాత జేసీబీలు, క్రేన్ల సహాయంతో రైలు కట్టను మొత్తం తవ్వి... ఆ ప్రాంతంలో ముందుగానే సిద్ధంగా ఉంచిన బ్లాకులను అమరుస్తారు. దీంతో బేగంపేట్–అమీర్‌పేట్‌ల మధ్య పట్టాల కింది నుంచి దారి ఏర్పడుతుంది. తిరిగి వెంటనే బ్లాకుల మీదుగా రైలు పట్టాలను పునరుద్ధరిస్తారు. తెల్లవారుజాము వరకు పనులు పూర్తి చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదీ ప్రాజెక్టు... రైల్వే పట్టాల మీది నుంచి కాకుండా ఓల్డ్ కస్టమ్స్ నుంచి లీలానగర్‌కు వెళ్లాలంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి కట్టమైసమ్మ ఆలయం, హెచ్‌పీఎస్ నుంచి మయూరిమార్గ్ వరకు వెళ్లి తిరిగి బేగంపేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. అలా కాకుండా రైలు పట్టాలు దాటితే ఒక్క నిమిషంలోనే లీలానగర్‌కు చేరుకోవచ్చు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురైనవారు ఎందరో ఉన్నారు. అదీ కాకుండా లీలానగర్ వైపు ఉండే రైల్వే రక్షక దళానికి చిక్కి కోర్టుకు వెళ్లి భారీగా జరిమానాలు చెల్లించుకున్నవారు మరెందరో. ఓవైపు ప్రమాదాలు.. మరోవైపు జరిమానాలు చెల్లించడం నిత్యకృత్యంగా మారింది. దీంతో స్థానికుల అభ్యర్థన మేరకు ఇక్కడ ఆర్యూబీ నిర్మాణాన్ని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2017 అక్టోబర్ 19న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం ఆర్బీయూ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.2.18 కోట్లను మంత్రి జీహెచ్ఎంసీ నుంచి మంజూరు చేయించి రైల్వే శాఖకు అందజేశారు. అయితే రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ఆర్యూబీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు మంత్రి తలసాని ఒత్తిడితో అనుమతులు రావడంతో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాదచారులకు మాత్రమే.. ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి లీలానగర్‌కు చేరేందుకు నిర్మిస్తున్న ఈ పెడస్ట్రియన్ ఆర్యూబీ ద్వారా కేవలం పాదచారులు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అమీర్‌పేట్ వైపు భూమి ఎత్తుగా ఉండడం, బేగంపేట్ వైపు పల్లంగా ఉండడంతో ఈ బ్రిడ్జి కిందుగా రాకపోకలు సాగించేవారు... అమీర్‌పేట్ నుంచి 8 మెట్ల వరకు ఎక్కి రైలు పట్టాల కింది నుంచి బ్రిడ్జి ద్వారా బేగంపేట్ వైపు చేరుకొని రెండు మెట్లు దిగాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా కేవలం నిమిషం వ్యవధిలోనే ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి లీలానగర్‌కు చేరుకోవచ్చు. -
టొరంటోలో పాదచారులపై కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో పాదచారులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి టొరంటోలోని గ్రీక్టౌన్లో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ పాదచారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరుగుతుండగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిపై కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన ఆ దుండగుడు కొద్ది దూరంలో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియదని, ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వివరించారు. -
టొరంటొలో ఉన్మాది ఘాతుకం
-
కెనడాలో పాదచారులపై దూసుకెళ్లిన ట్రక్కు
టొరంటో: కెనడాలోని సెంట్రల్ టొరంటోలో ఓ తెలుపు రంగు ట్రక్కు సోమవారం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడన్నారు. చివరికి ట్రక్కుతో పారిపోతున్న నిందితుడ్ని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడి సబ్వే ను మూసివేసిన పోలీసులు.. ఘటనాస్థలికి రావొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. -
సింక్ హోల్లో పడిపోయిన దంపతులు
సియోల్: బస్సు స్టాప్‌లో బస్సు ఆగింది. తాము దిగే స్టాప్ వచ్చిందని భర్త దిగాడు. అతడి వెంటనే అడుగులో అడుగు వేసుకుంటూ భార్య కూడా దిగింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పాదచారుల మార్గంలో నడుస్తుండగా... ఆ మార్గం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ దంపతులు ఇద్దరు ఒక్కసారిగా భూమిలోకి చోచ్చుకుని పడిపోయారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్రేన్ల సహాయంతో భార్యాభర్తలను బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దక్షిణ కోరియా రాజధాని సియోల్ నగరంలో చోటు చేసుకుంది. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పాదచారుల మార్గంలో డోల్లా ఎలా ఏర్పడిందనే అంశంపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.