6 గంటల్లోనే.. | Pedestrian RUB Construct in Six Hours | Sakshi
Sakshi News home page

6 గంటల్లోనే..

Published Sat, May 11 2019 8:38 AM | Last Updated on Sat, May 11 2019 8:38 AM

Pedestrian RUB Construct in Six Hours - Sakshi

ఆర్‌యూబీ నిర్మాణం ఇక్కడే..

సనత్‌నగర్‌: అది ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు. అయితే అనూహ్యంగా ఆరు గంటల్లోనే పూర్తి కానుంది. ఆదివారం నుంచి స్థానికులకు అందుబాటులోకి రానుంది. రైల్వే శాఖ తాజాగా అనుమతి ఇవ్వడంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రైల్వే అధికారులు కేవలం 6గంటల్లోనే పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు శనివారం అర్ధరాత్రి ముహూర్తం ఖరారు చేశారు. ఆదివారం తెల్లవారుజాము వరకు ఆర్‌యూబీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ నిర్మాణం ఎక్కడో తెలుసా? బేగంపేట్‌–అమీర్‌పేట్‌ మధ్య. ఈ ఆర్‌యూబీ నిర్మాణం పూర్తయితే బేగంపేట్‌ వైపున్న ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి అమీర్‌పేట్‌ వైపున్న లీలానగర్‌కు కాలినడకన ఒకే ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. అంతేకాకుండా దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆర్‌యూబీ కేవలం పాదచారులకు మాత్రమే. దీని ద్వారా వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. సిటీలోనే తొలిసారి నిర్మిస్తున్న పెడస్ట్రియన్‌ ఆర్‌యూబీ ఇదీ. 

పనులు ఇలా..  
శనివారం రాత్రి ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయం ముగిసిన తర్వాత, అన్ని దూర ప్రాంత సర్వీసులు నగరాన్ని దాటిన అనంతరం.. అంటే దాదాపు రాత్రి 11:30గంటల ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారు. ఆర్‌యూబీ కోసం ఇప్పటికే తొమ్మిది బ్లాకులను సిద్ధంగా ఉంచారు. పనుల్లో భాగంగా ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి లీలానగర్‌ మధ్యలో ఉన్న రైలు పట్టాలను కట్‌ చేస్తారు. ఆ తర్వాత జేసీబీలు, క్రేన్ల సహాయంతో రైలు కట్టను మొత్తం తవ్వి... ఆ ప్రాంతంలో ముందుగానే సిద్ధంగా ఉంచిన బ్లాకులను అమరుస్తారు. దీంతో బేగంపేట్‌–అమీర్‌పేట్‌ల మధ్య పట్టాల కింది నుంచి దారి ఏర్పడుతుంది. తిరిగి వెంటనే బ్లాకుల మీదుగా రైలు పట్టాలను పునరుద్ధరిస్తారు. తెల్లవారుజాము వరకు పనులు పూర్తి చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఇదీ ప్రాజెక్టు...  
రైల్వే పట్టాల మీది నుంచి కాకుండా ఓల్డ్‌ కస్టమ్స్‌ నుంచి లీలానగర్‌కు వెళ్లాలంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బేగంపేట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కట్టమైసమ్మ ఆలయం, హెచ్‌పీఎస్‌ నుంచి మయూరిమార్గ్‌ వరకు వెళ్లి తిరిగి బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. అలా కాకుండా రైలు పట్టాలు దాటితే ఒక్క నిమిషంలోనే లీలానగర్‌కు చేరుకోవచ్చు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురైనవారు ఎందరో ఉన్నారు. అదీ కాకుండా లీలానగర్‌ వైపు ఉండే రైల్వే రక్షక దళానికి చిక్కి కోర్టుకు వెళ్లి భారీగా జరిమానాలు చెల్లించుకున్నవారు మరెందరో. ఓవైపు ప్రమాదాలు.. మరోవైపు జరిమానాలు చెల్లించడం నిత్యకృత్యంగా మారింది. దీంతో స్థానికుల అభ్యర్థన మేరకు ఇక్కడ ఆర్‌యూబీ నిర్మాణాన్ని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2017 అక్టోబర్‌ 19న అప్పటి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం ఆర్‌బీయూ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.2.18 కోట్లను మంత్రి జీహెచ్‌ఎంసీ నుంచి మంజూరు చేయించి రైల్వే శాఖకు అందజేశారు. అయితే రైల్వే శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ఆర్‌యూబీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు మంత్రి తలసాని ఒత్తిడితో అనుమతులు రావడంతో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

పాదచారులకు మాత్రమే..
ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి లీలానగర్‌కు చేరేందుకు నిర్మిస్తున్న ఈ పెడస్ట్రియన్‌ ఆర్‌యూబీ ద్వారా కేవలం పాదచారులు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అమీర్‌పేట్‌ వైపు భూమి ఎత్తుగా ఉండడం, బేగంపేట్‌ వైపు పల్లంగా ఉండడంతో ఈ బ్రిడ్జి కిందుగా రాకపోకలు సాగించేవారు... అమీర్‌పేట్‌ నుంచి 8 మెట్ల వరకు ఎక్కి రైలు పట్టాల కింది నుంచి బ్రిడ్జి ద్వారా బేగంపేట్‌ వైపు చేరుకొని రెండు మెట్లు దిగాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా కేవలం నిమిషం వ్యవధిలోనే ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ నుంచి లీలానగర్‌కు చేరుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement