ఎండీ, ఎంఎస్ సీట్లకు కోత
ఆంధ్ర మెడికల్ కళాశాలకు ఎదురుదెబ్బ
హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత పురాతన కళాశాల, వైద్య విద్యలో గొప్ప పేరుప్రతిష్టలున్న ఆంధ్ర మెడికల్ కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. వసతుల లేమి కారణంగా ఎండీ పీడియాట్రిక్, ఎంఎస్ ఈఎన్టీ సీట్లను తొలగించారు. ఎండీ పీడియాట్రిక్ 5 సీట్లు, ఎంఎస్ ఈఎన్టీలో 5 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.
కళాశాలలో ఉన్న వసతులను తనిఖీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం ఎంసీఐ బృందం విశాఖలోని ఆంధ్రమెడికల్ కళాశాలను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో పీడియాట్రిక్ విభాగంలో 120 పడకలు ఉండాల్సి ఉండగా, 60 మాత్రమే ఉన్నాయని, బోధనా ప్రమాణాలు లేవని, ఔట్ పేషెంట్ విభాగం సరిగా లేదని తేల్చారు. అలాగే ఈఎన్టీ విభాగంలోనూ స్పెషాలిటీ క్లినిక్ లేదని, ఓపీ సరిగా లేదని పేర్కొన్నారు. విచిత్రమేమంటే ప్రస్తుతం వైద్య విద్యసంచాలకులుగా ఉన్న డా.శాంతారావు ఇదే కళాశాలలో చదివి, అక్కడే పనిచేసి వచ్చిన వారే.
ఆంధ్రా మెడికల్ కళాశాలకు కొత్తగా సీట్లు రాకపోగా ఉన్న సీట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. మరిన్ని కళాశాలలు కూడా సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంసీఐ వర్గాలు తెలిపాయి.