2018 కల్లా మరో 700 మంది నియామకం
పెగాసిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్‌రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న పెగాసిస్టమ్స్ ఇండియా 2018 చివరినాటికి మరో 700 మంది నిపుణులను నియమించుకోనుంది. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో హైదరాబాద్, బెంగళూరులో కేంద్రాలున్నాయి. పరిశోధన, అభివృద్ధితోపాటు ఆవిష్కరణలన్నీ ఈ సెంటర్లలోనే కేంద్రీకృతమయ్యాయి. 1,300 మందికిపైగా నిపుణులు పనిచేస్తున్నారని పెగాసిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్ రెడ్డి ఈదునూరి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 2,000 మంది సిబ్బంది కూర్చునే వీలుందని చెప్పారు. ఫార్చూన్-500 కంపెనీల్లో 60 శాతందాకా కంపెనీలు పెగాసిస్టమ్స్‌కు క్లయింట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫార్చూన్-3,000 కంపెనీలను తమ సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. లాస్‌వెగాస్‌లో జరుగుతున్న పెగావరల్డ్ సదస్సుకు అనుబంధంగా హైదరాబాద్‌లో సైతం కంపెనీ మెగా ఈవెంట్‌ను నిర్వహించింది.