‘పెలికాన్ ’ కంపెనీని మళ్లీ తెరవాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల పాదయాత్ర
రాజేంద్రనగర్: పెలికాన్ రబ్బర్ కంపెనీని మళ్లీ తెరిచి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం గగన్ పహాడ్, కాటేదాన్ చౌరస్తా పారిశ్రామిక వాడలలో రాజేంద్రనగర్ జోన్ సీఐటీయూ అధ్యక్షుడు వి.జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెలికాన్ రబ్బర్ కంపెనీని అక్రమంగా లాకౌట్ చేశారన్నారు. దీంతో 20 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. దాదాపు 300 మంది కార్మికులు కంపెనీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఎల్ఐసీ, రెండేళ్ల బోనస్ ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. కార్మికులు ఉత్పత్తి చేసిన కోట్లాది రూపాయల విలువైన ట్యూబ్‌లను గోదాంల్లో దాచి పెట్టారని చెప్పారు.
కంపెనీ యజమాని ఆనంద్ అగర్వాల్ కొత్తగా సాబురి ఇన్ క్స్ పేరుతో మరో కంపెనీని సృష్టించి కంటెయినర్లలో మాల్‌ను తరలిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కార్మికులకు మూడు నెలల జీతాలు ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులతో కలిసి ఆనంద్ అగర్వాల్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అక్రమ లాకౌట్‌ను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో జె.రవీందర్, పి.నర్సింహులు, సిద్ధయ్య, మల్లేష్, కృష్ణ, మహేందర్, జహంగీర్, కేతమ్మ, రజని, ఆనంద్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.