అందమైన అందం
అద్దంలో కనబడేది ఒక అందం.మనసుకు అద్దం పడితే కనబడేది ఇంకో అందం.అద్దాల మేడ నుంచి దిగి వస్తే అదొక అందం.అద్దంలో ఉండేది నీడే అని గుర్తిస్తే...అదింకో అందం. దీప్తిలో ఈ అందాలన్నీ కలగలసి ఉన్నాయి. అందుకే ఆమె.. అందానికే అందం. అందమైన అందం!
సౌందర్య లహరీ.. స్వప్న సుందరీ.. అంటూ ‘పెళ్లి సందడి’తో అప్పటి యూత్‌కి డ్రీమ్ గర్ల్ అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత తెలుగుకి రావడం ఎలా ఉంది?
సంతోషంగా, ఎగై్జటింగ్‌గా ఉంది. పని చేయడానికి చాలా అనువైన ఇండస్ట్రీ ఇది. వండర్ఫుల్ ఆర్టిస్ట్‌లు, బ్రిలియంట్ టెక్నీషియన్లు ఉన్నారిక్కడ. ప్రేక్షకులు స్టార్స్‌ను ప్రేమించే తీరు అద్భుతం. అందుకే టాలీవుడ్ ఈజ్ వన్నాఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇండస్ట్రీస్.
‘పెళ్లి సందడి’ సినిమాలో రాఘవేంద్రరావుగారి టేకింగ్ గురించి..
‘సౌందర్య లహరి..’ పాటతోనే నా పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆ పాటకు డ్యాన్స్ డైరెక్టర్ లేరు. ఫ్యాబ్రిక్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్‌తోనే ఆ సాంగ్‌ను కంపోజ్ చేశారాయన. రాఘవేంద్రరావుగారికో టిపికల్ టేకింగ్ స్టైల్ ఉంది. హీరోయిన్ను గ్లామరస్‌గా చూపిస్తారు. ఒక పాటలో అయితే ఏకంగా 20 నుంచి 30 డ్రెస్‌లు మార్చాను. అప్పట్లో ఆ సినిమాకి బాలీవుడ్ డిజైనర్లు నీతా లుల్లా, మనీష్ మల్హోత్రాతో నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారు. రాఘవేంద్రరావుగారి టేకింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాను.
‘పెళ్లి సందడి’లో మీది గ్లామరస్ రోల్. ఆ తర్వాత కూడా దాదాపు అలాంటివే చేయడంవల్ల మీ మీద గ్లామర్ ట్యాగ్ పడిపోవడం బాధగా ఉంటుందా?
అదేంటో కానీ నాకన్నీ గ్లామరస్ రోల్సే వచ్చాయి. హిందీ, తెలుగు సినిమాల్లో గ్లామరస్ రోల్స్‌లోనే నన్ను ఎక్కువగా చూశారు. ప్రస్తుతం చేస్తున్న ‘కిట్టి పార్టీ’ సినిమాలో కూడా గ్లామరస్‌గానే కనిపిస్తాను. గ్లామరస్‌గా ఉండటం తప్పేం కాదు. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ‘సౌందర్య లహరి, స్వప్న సుందరి’ అని నన్ను పిలుస్తుంటారు. 20 ఏళ్లుగా ‘స్వప్న సుందరి’ అనేది నా జీవితంలో ఒక పార్ట్, ఓ పేరు అయిపోయింది. హేమమాలినిని బాలీవుడ్లో డ్రీమ్‌గాళ్ అని ఎలా పిలిచేవాళ్లో అలా టాలీవుడ్ ప్రేక్షకులు నన్ను స్వప్న సుందరి అని పిలుస్తున్నారు (నవ్వేస్తూ).
స్వప్నసుందరి అనే అభినందనను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు..
కచ్చితంగా. రాఘవేంద్రరావుగారు ఇచ్చిన ఈ టైటిల్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. 20 ఏళ్లైనా నా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేదు కదా (నవ్వుతూ).
మీ దృష్టిలో గ్లామర్ అంటే ఏంటి?
స్కిన్ షో అనేది మాత్రమే గ్లామర్ అనుకోను. మనల్ని మనం ఎలా మెయింటైన్ చేçసుకుంటున్నాం, వేసుకున్న కాస్ట్యూమ్ని ఎలా క్యారీ చేస్తాం.. వంటివన్నీ గ్లామరస్‌గా ఉండటం కిందకే వస్తాయి. చాలా మంది అంటుంటారు నేను టైమ్‌లో స్టక్ అయిపోయాను అని. అంటే.. 20 ఏళ్ల క్రితం దగ్గరే ఆగిపోయాయని (నవ్వుతూ). ఫిజిక్ ఇప్పటికీ అలానే ఉందంటున్నారు. నిజానికి నేను బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. మనలోని అంతః సౌందర్యమే బయటకు కనిపిస్తుందని నేను నమ్ముతా. మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే అదే మన ముఖంలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది.
ప్రశాంతంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు. బహుశా మీరు ఆధ్యాత్మిక యాత్రలు చేయడంతోపాటు దలైలామా వంటి బౌద్ధగురువులను, ఇతర ఆధ్యాత్మిక గురువులను కలుస్తుంటారు కాబట్టేనేమో?
నా ఫ్రెండ్ ఒకరు దలైలామాను కలవడానికి నన్ను ఆహ్వానించారు. ఆయన్ను కలిసి, పూల మాల వేశాను. ఆయన కాళ్లకు నమస్కరించి ఓ ఫోటో తీసుకుందామనుకున్నా. ఫొటో కావాలని ఆయన్ను అడగలేదు. కానీ నా ముఖ ఖవళికలను చూసి ఆ విషయాన్ని గ్రహించినట్టున్నారు. సెక్యూరిటీ గార్డ్ మాత్రం పిక్చర్స్ తీసుకోవడం కుదరదు అన్నారు. ఈలోపు దలైలామా ముందుకు వెళ్లిపోయారు. కాస్త ముందుకెళ్లాక ఆ అమ్మాయి ఎక్కడ? అని అడిగారు. ఆ అమ్మాయి అంటే నా గురించే అని నేను గ్రహించలేదు. ఆయన చుట్టూ చూస్తూ, నన్ను చూసి, దగ్గరకు రమ్మన్నట్లుగా సైగచేశారు. వెళ్లాను. ‘ఫొటో దిగుదాం అనుకున్నావు కదా? కెమెరా తెచ్చుకో’ అన్నారు. ఆయనతో రెండు ఫొటోలు దిగాను. ఎవరికీ ఇలా ఫొటో ఇచ్చి ఉండరనుకుంటా. నాతో కనెక్ట్ అయ్యారనుకుంటున్నాను.
ఆ కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది?
అది స్వచ్ఛమైన మనసు వల్లే జరిగిందేమో? ఒక స్వచ్ఛమైన మనసే మరో మనసుని చదవగలదేమో? అది ఆయన చదివి, నా ఆంక్షను తీర్చాలని అనుకుని మళ్లీ పిలిచారని నేననుకుంటాను. దాన్ని ఆశీర్వాదంలా భావిస్తాను.
‘యాత్ర’ అనే దైవ సంబంధింత టీవీ షో చేస్తున్నారు. ఆ షో గురించి కొన్ని మాటలు చెబుతారా?
ఈ షో ద్వారా గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది. 51 శక్తిపీఠాలు, జగన్నాథ్ పూరి, రామేశ్వరం, గంగోత్రి, యమునోత్రి, 12 జ్యోతిర్లింగాలు.. ఇలా ఎన్నింటినో దర్శించాను. జీసస్ పుట్టిన చోటుకు వెళ్లాను, అల్లా కోసం మొహమద్ ప్రోఫెట్ తపస్సు చేసిన చోటుని సందర్శించా. గురుద్వారాలకు వెళ్లాను. 5 వేల గుళ్లను దర్శించుకున్నాను. దేవుడు ఇక్కడ వెలిశాడు అనుకున్న ప్రతిచోటుకు వెళ్లాను. నాకు తెలిసి సాధారణంగా ఒక్క జన్మలో ఇది కుదరదనుకుంటాను. నాకు లభించిన ఆశీర్వాదం ఇది.
ఆ యాత్రలు మీలో తీసుకొచ్చిన మార్పేంటి?
నా జీవితంలో నన్ను బాగా మార్చిన, ప్రభావితం చేసినది ‘యాత్ర’ షో అని చెప్పగలను. ఈ షో చేసిన తర్వాత ‘నేను చాలా చిన్నదాన్ని’ అని అర్థం అయింది. ఇంత పెద్ద ప్రపంచంలో మనమెంత అనే విషయం బోధపడింది. అప్పటి నుంచి ఏదైనా సరే నాకే దక్కాలి, మనమే గొప్ప అనే భావన పోయింది. ఏదైనా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా సెంటర్లో నేనే ఉండాలి, సీన్లో ముందుండాలి అనుకోవడం ఆపేశాను. అన్నీ నేనే పొందాలనే భావన పోయింది.
‘గివర్’లా ఉండాలనుకుంటున్నా. మనకు ఒక్కటే లైఫ్. దేవుడు ఎంతో ప్రేమగా నేను ఊహించినదానికంటే అధికంగా ఇచ్చాడు. నేను తిరిగి ఇవ్వడమే బాకీ. తోటివాళ్లతో బాగుండటం, సహాయం చేయడం కూడా గివింగ్లో భాగమే. క్యాన్సర్ భాధితులకు సాయం చేస్తుంటాను. ఫ్రెండ్స్ అందరం కలసి ఇంట్లో టీ పార్టీ చేసుకుంటాం. ఎవరి బిల్ వాళ్లం పే చేసుకొని, ఆ డబ్బునంతా పేదవాళ్లకు అందిస్తాం. చిన్నా పెద్దా అందర్నీ గౌరవిస్తాను. మనకు డోర్ ఓపెన్ చేసేవాళ్లను కూడా గౌరవంగా చూడాలి. ఇంకో ముఖ్య విషయం.. తప్పు నాదైనా, కాకపోయినా సారీ చెప్పడం నేర్చుకున్నాను.
అలా సారీ చెప్పడం వల్ల కొందరు మిమ్మల్ని తేలికగా తీసుకునే అవకాశం ఉంది కదా?
వాళ్లు తీసుకోవచ్చు. కానీ నాకది పెద్ద విషయం కాదనిపిస్తుంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను. మనుషులన్నాక తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ మనం చేసిన తప్పులు మనం తెలుసుకోగలగాలి, అంగీకరించగలగాలి. అప్పుడు మనం ఇంకా బెటర్ పర్సన్ అవ్వగలుగుతాం.
చాలా తీర్థయాత్రలు చేశారు కాబట్టి మీ దృష్టిలో దేవుడంటే ఏంటి?
గుడి అంటే ఏంటి? అందులో నిజంగా దేవుడు ఉంటాడా? అని ఓసారి శంకరాచార్యగారిని అడిగా. ‘‘దీప్తీ. గుడి బ్యాంక్లాంటిది. అక్కడికి భక్తులు చాలా పాజిటివ్ ఆలోచనలతో వస్తుంటారు. ఆ పాజిటివ్ ఎనర్జీతో టెంపల్ పవర్‌ఫుల్‌గా మారుతుంటుంది. మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఆ ఎనర్జీయే దేవుడు. అక్కడ ప్రార్థన చేస్తే కచ్చితంగా మనసు ప్రశాంతం అయిపోతుంది. గుడిలో ఉన్నప్పుడు చెడు మాట్లాడం, చెడు తలపెట్టం. మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛతే దేవుడు. మన హృదయం స్వచ్ఛంగా ఉంటే మనలోనే దేవుడు ఉన్నట్టు. మంచి ఆలోచనలే చేస్తుంటే మనలోనే దేవుడు కొలువైనట్టు’’ అన్నారు. కరెక్టే కదా. ఆ మాటల ప్రభావం, నేను సందర్శించిన దేవాలయాలు నా ఆలోచనా విధానాన్ని, జీవితాన్ని చూసే కోణాన్ని మార్చివేశాయి.
దేవుడితో ఎలా కనెక్ట్ అవుతారు?
నేను దేవుడిని చూస్తాను, ఆయనతో మాట్లాడుతుంటాను. ఇదంతా నమ్మేలా అనిపించకపోయినా ఆయనతో నేను మాట్లాడగలను. ‘యాత్ర’ షోలో భాగంగా రామేశ్వరంలో ఓ టెంఫుల్లో షూట్ చేద్దాం అని 17 ఏళ్లు ప్రయత్నించాను. సాధారణంగా షూట్ చేయడానికి అనుమతించరు. నేనెంత ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో... ‘నువ్వే నన్ను పిలువు’ అని మనసులో బలంగా సంకల్పించుకున్నాను. ఓసారి మళ్లీ ఆ గుడికి వెళ్లాను. పంతులుగారు ‘నువ్వు లోపలకి రామ్మా’ అన్నారు. కెమెరాతో రావచ్చా? అని అడిగాను. ‘ఏం ఫర్వాలేదు రా’ అన్నారు. లోపలకు వెళ్లాను. నీ ఇష్టం వచ్చినంతసేపు ప్రార్థన చేసుకో అని చెప్పారు. దేవుడు నా తల మీద చేతులు పెట్టి నిమిరినట్టుగా అనిపించింది. షోలో ఆ ఎపిసోడ్లో నేను ఎమోషనల్ అవ్వడం గమ నించవచ్చు. ఆయన్ను చూడాలనుకుంటే ఆయనే నన్ను తన దగ్గరకు పిలిచారు. దానికి హృదయం చాలా స్వచ్ఛంగా ఉండాలంటాను.
మసీదుకు, చర్చ్‌కు వెళ్లినా ఇలాంటి ఎమోషన్‌నే ఫీల్ అవుతారా?
అలానే ఫీల్ అవుతా. యోర్దాను నది దగ్గరకు వెళ్లాను. జీసస్ బాప్తీస్మం తీసుకున్న చోటు అది. నా పిల్లలతో అక్కడికి వెళ్ళినప్పుడు ఫాదర్‌తో నేను బాప్తీస్మం తీసుకోవాలనుకుంటున్నా అన్నాను. నువ్వు హిందు. బాప్తీస్మం పుచ్చుకుంటే క్రిస్టియన్‌గా మారిపోతావు.. నీకు సమ్మతమేనా? అని అడిగారు. ఓకే అన్నాను. బాప్తీస్మం తీసుకున్నాను. నా వరకూ నేను హిందువుని, ముస్లిమ్‌ని, క్రిస్టియన్ని, బౌద్ధురాలిని. నాకు ఒక్క మతం అనేది లేదనుకుంటా. ఎవ్వరూ వెళ్లలేని చోటుకు కూడా నేను వెళ్లగలుగుతున్నాను. నేను శివ భక్తురాలిని. అందుకే మా అబ్బాయికి ‘శివ్’ అని పేరు పెట్టాను. నా సిస్టర్‌కు ఆరోగ్యం బాగా లేనప్పుడు జీసస్‌ను ప్రార్థించాను. నువ్వు ముస్లిం కాబట్టి గుళ్లో ప్రార్థనలు చేయకూడదు అంటే నేను నమ్మను. ఏ దేవుడిని ప్రార్థించినా ప్రార్థన ప్రార్థనే.
ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న మీకు కొందరు మతాల కోసం, ప్రాంతాల కోసం గొడవలు పడటం చూస్తే ఏమనిపిస్తుంటుంది?
చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. దేవుడు ఒక్కరే అని స్కూల్లో చదువుకున్నాం. కానీ దేవుడి కోసం గొడవపడుతున్నాం. మనమంతా ఒక్కటే అని చదువుకున్నాం. ప్రాంతాల కోసం గొడవ. ఇలా ప్రతిదానికీ గొడవపడుతూనే ఉంటాం. పోయేటప్పుడు అన్నీ ఇక్కడే వదిలేసి పోతాం. మరి అలాంటి అశాశ్వతమైన వాటి కోసం ఎందుకీ ప్రయాస? అనిపిస్తుంటుంది. యుద్ధాలు ఎందుకు? డబ్బు కోసం ఆరాటం ఎందుకు? నా పర్సనల్ లైఫ్‌కి దీన్ని ఆపాదించుకున్నాను కూడా.
‘మీ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీకు నచ్చిన ట్రస్ట్‌కు దానం చేసేయండి. లేదంటే నచ్చినవాళ్లకు ఇచ్చేయండి’ అని మా అమ్మతో చెప్పాను. నేను బాంబే వెళ్లినప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఈ రోజు నాకో పెద్ద ఇల్లు, చాలా సౌకర్యాలు ఉన్నాయి. కష్టపడ్డాను. సీరియల్స్‌లో కనిపించాను. సినిమాల్లో పేరు తెచ్చుకున్నాను. ఇండియాలో ఫస్ట్ ట్రావెల్ షో నాదే. కేవలం సినిమాలు మాత్రమే చేసినవాళ్లు రిటైర్ అయిపోయారు. కానీ నేనింకా ఫీల్డ్‌లోనే ఉన్నాను. అప్పట్లో మా అమ్మ దగ్గర్నుంచి ఏమీ తీసుకోలేదు. ట్రస్ట్‌కి ఇచ్చేయమన్నాను. అలాగే నా ఆస్తినంతా ఓ ట్రస్ట్‌కు ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను.
మీ పిల్లలకు కూడా ఇవ్వరా?
లేదు. మా పెద్దబ్బాయి శుభ్. చిన్నబ్బాయి శివ్‌కు నేను, నా భర్త (రణ్‌దీప్ ఆర్య) ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్నాం. మరి మేం సంపాదించింది వాళ్లకి ఎందుకు? అంత చదువులు చదివి వాళ్లను వాళ్లు తయారు చేసుకోలేకపోతే వాళ్లు ఫెయిల్ అయినట్టేగా? పిల్లలను బాగా చదివించగలిగితే మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు అని నా భార్త నమ్మకం. నా ఇంటిని ఓల్డేజ్ హోమ్‌గా మార్చాలనుకుంటున్నా.
మీ అబ్బాయిలు మీ ‘పెళ్లి సందడి’ చూశారా?
చూశారు. అమ్మా నువ్వెందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు? అన్నారు. వాళ్లు అమెరికన్ స్కూల్లో చదువుతున్నారు. ఆ సినిమాలో కొన్ని సీన్స్ చూసి, ఇన్ని పూలు, పండ్లు ఏంటి? అని అడిగారు. వాళ్లకు నా సినిమాలు చూడటం పెద్దగా ఇష్టం ఉండదు. మా శుభ్‌కు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. వాడికిప్పుడు 16 ఏళ్లు. స్క్రిప్ట్‌లు రెడీ చేసుకుంటున్నాడు.
భవిష్యత్‌లో తన సినిమాల్లో మీరు నటించాలనుకుంటున్నారా?
లేదు. వాడు నా ఫ్యాన్ కాదు. ‘నేను బాలీవుడ్ సినిమా తీయను. ఇంగ్లీష్ మూవీ తీస్తాను’ అంటాడు. ‘ఒరేయ్ మూవీ మేకింగ్‌లో పెద్ద ఇండస్ట్రీ ఇదే.. నువ్వు మళ్లీ ఇక్కడకు రావాల్సిందే’ అని వాడితో అంటాను. పిల్లలిద్దరూ నాతో చాలా టెంపుల్స్‌కు వచ్చారు. శివ్‌కు పదేళ్లే. వాడికి చాలా శ్లోకాలు వచ్చేశాయి. విష్ణు, శివ స్తోత్రాలు, హనుమాన్ చాలీసా అన్నీ నేర్చుకున్నాడు. శివ్ యానిమేషన్ వీడియోలు చేస్తుంటాడు. ఎవరిని చూస్తే వారిని ఓ పాత్రగా అనుకుని డైలాగ్స్ రాసి, చెబుతుంటాడు.
వెరీ నైస్.. భర్త, ఇద్దరు పిల్లలతో పర్సనల్ లైఫ్.. వెండితెరపై గ్లామరస్ జర్నీ.. చిన్ని తెరకు ఆధ్యాత్మిక జర్నీ.. ఓ ప్రొడక్షన్ హౌస్ రన్, వీటికి సంబంధం లేని ఓ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. కావాలనే ప్లాన్ చేసుకున్నారా?
నాకు వెర్సటైల్‌గా ఉండటం ఇష్టం. మోడల్, యాక్టర్, బిజినెస్ ఉమన్, టూరిస్ట్ అడ్వైజర్, ప్రొడక్షన్ హౌస్ఓనర్.. ఇలా కావాలనే చేస్తున్నాను. మా ప్రొడక్షన్ కంపెనీలో జీతాలు నెలవారీగా ఇవ్వం. ప్రతి శనివారం ఇస్తుంటాం. ఎందుకంటే మా దగ్గర పనిచేసేవాళ్లు నెలాఖరు వరకూ వాళ్ల అవసరాలను ఆపుకోకూడదు. అందుకే ఇలా చేస్తుంటాం. మా ఆఫీసులో నాకు ప్రత్యేకంగా క్యాబిన్ ఉండదు. అందరితోపాటే కూర్చుంటాను. నేను మీ బాస్ కాదు.. ఫ్రెండ్ అని చెబుతుంటాను. ప్రొడక్షన్ హౌస్‌లో ఫ్రెండ్లీగా ఉండటం మంచిదని నా అభిప్రాయం.
ఇన్ని పనులు చేయడానికి టైమెలా దొరుకుతోంది?
(గట్టిగా నవ్వుతూ). మల్టీటాస్కింగ్ చేస్తుంటా. ఈ విషయంలో మా చిన్నోడు కొంచెం అప్సెట్లో ఉన్నాడు. ఈ మధ్య వాడి స్కూల్లో పేరెంట్స్–టీచర్ మీటింగ్ జరిగింది. నేను షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. వాళ్ల నాన్న వెళ్తారనుకోండి. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది.
ఉమెన్ మాత్రమే మల్టీటాస్కింగ్ చేయగలుగుతారనుకుంటాను?
నిజమే. అబ్బాయిలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎంత పనినైనా డీల్ చేసే ఓర్పు, నేర్పు స్త్రీలకే ఉంటుంది. బయట ఇన్ని పనులు చేస్తున్నా ఇంట్లో అందరికీ నేనే వండిపెడతాను. ఎంత ఇష్టంగా వండుతానో అంతే ఇష్టంగా తింటాను. నేను వండటానికి కారణం.. హెల్దీఫుడ్ ప్లాన్ చేసుకుంటాను. అది కుక్కి చెప్పి వండించుకునే బదులు నేను వండేసుకుంటాను. వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఎంత పని అయినా ఈజీగా చేసేయగలుగుతాం.
ఫైనల్లీ.. మొన్న శుక్రవారం ఉమెన్స్ డే. ఈ సందర్భంగా నాలుగు మంచి మాటలేమైనా చెబుతారా?
ప్రతి రోజూ ఉమెన్స్ డేనే. ఎందుకంటే జన్మనిచ్చేది స్త్రీ మాత్రమే. సృష్టిని నడిపించేది స్త్రీ మాత్రమే. స్త్రీ లేకుండా ఒక్క రోజు కూడా ఉండదు. మగాళ్లను దాటుకుని వెళ్లాలి. అవసరమైతే వాళ్ల వెనకాల ఉండి కూడా పనిచేయాలనుకునే మనస్తత్వం నాది. రెండూ చేయగలుగుతాను. వాళ్లకు సమానంగా కూడా పని చేయగలుగుతాను. హౌస్‌వైఫ్ అయినా, వర్కింగ్ ఉమన్ అయినా ప్రతి ఉమన్‌కు కాన్ఫిడెన్స్ మాత్రం కచ్చితంగా ఉండాలి. ప్రతి స్త్రీ ఇండిపెండెంట్‌గా ఉండగలగాలి. ఒక్కొక్కరికీ ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. వంట మాత్రమే తెలిసినవాళ్లకు కుకరీ షోలు ఉన్నాయి. కుట్టుపని చేసేవాళ్లకీ అవకాశాలు ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మనం ఎలా అందిపుచ్చుకుంటున్నామన్నది మన చేతుల్లో ఉంటుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అసూయపడటం లేదు. ఎవరి క్వాలిటీ వాళ్లకు ఉన్నప్పుడు జెలసీ ఎందుకు ఫీల్ అవాలి? మిర్చీ మిర్చీయే. ఆనియన్ ఆనియనే కదా (నవ్వుతూ).
డి.జి. భవాని
ఇప్పుడు ‘కిట్టీ పార్టీ’ లో ఆరుగురు కథానాయికలతో కలిసి నటిస్తున్నారు. మీ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది?
నేనెప్పుడూ మెయిన్ రోల్ కావాలి అని పట్టుబట్టలేదు. మనం ఎక్కడున్నా మనకు వచ్చే గుర్తింపు మనకు వస్తుందనుకుంటున్నాను. నేను చాలా అచీవ్ చేశాను. ఇంకేం కావాలి? ప్రస్తుతం ఉన్నదాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. ‘కిట్టీ పార్టీ’ కథ నాకు చాలా నచ్చింది. దర్శకుడు పవన్ మంచికథతో వచ్చారు. ఒక ఆర్టిస్ట్‌గా ఆ కథను కాదనలేకపోయాను.
2004 తర్వాత సినిమాల్లో ఎందుకు కనిపించలేదు?
2004 నుంచి ఇప్పటివరకూ ఎక్కడ కనపడినా సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అని అడుగుతూనే ఉంటారు. ‘కిట్టి పార్టీ’ సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేయగానే ‘థ్యాంక్యూ మేడమ్’ అని సోషల్ మీడియాలో చాలామంది మెసేజ్‌లు పంపారు. ప్రొడక్షన్, టెలివిజన్ షోలు అన్ని పనుల్లో బిజీగా ఉండటంతో కుదర్లేదు. మళ్లీ సినిమా చేయాలనే అనుకుంటూ ఉన్నాను. కుదర్లేదు. రీసెంట్గా ఆస్ట్రియా వెళ్లినప్పుడు అక్కడ ఆంధ్రా ఫ్యామిలీ వాళ్లు గుర్తుపట్టారు. మా పిల్లలతో ఓ ఫొటో దిగుతారా? ఇంటికి వెళ్లాక మీ ‘సౌందర్య లహరి..’’ పాట వాళ్లకు చూపిస్తాను అన్నారు. అది నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది. రాఘవేంద్రరావుగారికి జీవితాంతం థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. ఇక సినిమాల్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను.