ఆకలి బాధల నుంచి ఐఏయస్ వరకు
స్ఫూర్తి
స్కూల్లో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకొని ‘శభాష్’ అనిపించుకునే పేమ్‌కు పెద్దగా కలలేమీ ఉండేవి కావు. మంచి కళాశాలలో చదువుకోవాలనే కోరిక మాత్రం ఉండేది. కాలేజీ చదువు కోసం షిల్లాంగ్ వెళ్లడం అతని జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. అప్పుడు తానొక కల కన్నాడు... ఐఏయస్ అవ్వాలని.
కల సంపన్నంగా ఉంది. ఇంట్లో తిష్ఠ వేసిన బీదరికం మాత్రం వెక్కిరించింది. అయితే వెక్కిరింపులకు వెరవకుండా కష్టాలకు ఎదురీది అనుకున్నది సాధించాడు. ఐఏయస్ అయ్యాడు. ఐఏఎస్ ట్రైనింగ్ కాలంలో వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. తప్పనిసరి పరిస్థితిలో నాన్నను విడిచి వెళ్లాల్సి వచ్చింది. క్లాసులో కూర్చున్నా మనసంతా నాన్న మీదే ఉండేది.
ఒకరోజు నాన్నకు సీరియస్‌గా ఉందనే వార్త తెలిసి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఆయన చనిపోయారు. కన్నీళ్లు ఆగలేదు. ‘‘మా నాన్న చివరి రోజుల్లో దగ్గర లేను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది’’ అంటాడు బాధగా పేమ్.
‘‘బీదవాళ్లకు సహాయపడు’’ అని నాన్న చెప్పిన మాట మాత్రం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటాడు. మణిపూర్‌లో కొన్ని జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు తన పరిధిలో పేదవాళ్లకు సహాయపడ్డాడు.
ముప్పైతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ ఆయనకు ఆదర్శం. మండేలా, మదర్ థెరిసా అంటే కూడా చాలా అభిమానం.
‘‘బాగా కష్టపడి పని చేసే అధికారి’’ అన్న పేరును తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు ఇరవై తొమ్మిది ఏళ్ళ పేమ్. మేఘాలయాలోని జెమి నాగ తెగలో తొలి ఐఏయస్ అధికారి అయిన పేమ్ ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో జాయింట్ సెక్రటరీ హాదాలో పనిచేస్తున్నాడు.