ఖాతాదారులను ఎగరేసుకుపోయే ప్రమాదం
- పేమెంట్ బ్యాంకుల రాకపై ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యలు
ముంబై: ప్రతిపాదిత పేమెంటు బ్యాంకులు (పీబీ) క్రమంగా పూర్తి స్థాయి బ్యాంకుల ఖాతాదారులను ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ స్థాయి జీతాలు మొదలైన బాదరబందీ ఉండని, సాంకేతికంగా అధునాతనమైన పీబీల రాకతో పోటీ తీవ్రమై బ్యాంకులు ‘కాట్లకుక్కల్లా’ పోటీపడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ-కామర్స్ కంపెనీల బాటలోనే పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన పేమెంట్ బ్యాంకులు.. మార్కెట్ వాటా దక్కించుకునేందుకు తొలుత భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అరుంధతి చెప్పారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్న పూర్తి స్థాయి బ్యాంకులకు దీనివల్ల సంక్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుందని ఎఫ్‌ఐబీఏసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పీబీలతో పోటీపడేం దుకు ఆయా బ్యాంకులు కొంగొత్త వ్యూహాలు అమలు చేయాల్సి వస్తుందన్నారు. కాగా కాల్‌డ్రాప్ కష్టాలు తనకూ తప్పడంలేదని ఒక సందర్భంలో ఆమె పేర్కొన్నారు.