ఓ చిన్న నేమ్ ప్లేట్ మారుస్తోంది..
విద్యావంతురాలైన తల్లి వందమంది గురువులతో సమానమని వేదాలు చెబుతున్నాయి. మరి వేదాలకు పుట్టినిల్లయిన మనదేశంలో చదువుకున్న తల్లులు ఎంతమంది? పట్టణాల సంగతి పక్కనపెడితే.. గ్రామాల్లో చదువుకున్న మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దీనికి కారణం మనదేశంలోని చాలా ప్రాంతాల్లో బాలికా విద్యకు ప్రాధాన్యత లేకపోవడమే. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మారని ఈ జాడ్యాన్ని ఓ చిన్న నేమ్ ప్లేట్ మారుస్తోంది. అదెలాగో చదవండి..
ఇల్లు ఎంత గొప్పగా కట్టుకున్నా సరే.. అది ఎవరిదో తెలియాలంటే దానికో నేమ్ ప్లేట్ ఉండాల్సిందే. ఆ ప్లేట్‌ను చూసుకున్నప్పుడల్లా ఆ ఇంటి యజమానిలో ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడీ నేమ్ ప్లేట్ గోల ఎందుకంటే... చండీగఢ్‌లో చదువుకు దూరమవుతున్న బాలికలను ఈ నేమ్ ప్లేట్లే బడికి పంపిస్తున్నాయి. ఆడపిల్లకు చదువెందుకు? అనే తల్లిదండ్రుల ఆలోచనను మారుస్తున్నాయి.
పెమినా సాహు.. నైన్త్ క్లాస్ అనే బోర్డు తగిలించి ఉన్న ఆ ఇంటిని చూసి బయటివాళ్లే కాదు.. స్వయంగా పెమినా కూడా ఆశ్చర్యపోయింది. ఇంటికి తన పేరు పెట్టడమేంటి? అని అమ్మానాన్నను అడిగింది. ‘ఇప్పుడు చదువుకుంటున్న ఆడపిల్ల ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంటికి ఆమె పేరే పెట్టాలట’.. అంటూ వారు చెప్పిన సమాధానం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వెంటనే తన స్నేహితుల ఇళ్లకు వెళ్లి చూసింది. జాగృతి... నీరజ.. మాలిని.. ఇలా అందరి ఇళ్లకు నేమ్ ప్లేట్లు ఉండడంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయింది.
ఎందుకంటే..
దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే చండీగఢ్‌లోని బాలోద్ జిల్లా బాలికా విద్య విషయంలో చాలా వెనుకబడి ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల ఫలాలు కూడా వారికి అందడంలేదు. దీంతో ఆ జిల్లా కలెక్టర్ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ నేమ్ ప్లేట్ ఐడియా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పఢావో పథకం అమలులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ రాజేశ్‌సింగ్ తెలిపారు.
ఎంతో మార్పు..
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాలుగైదు నెలల్లోనే స్థానికుల నుంచి అపూర్వ స్పందన కనిపించింది. సర్పంచ్ మొదలుకొని గ్రామ పెద్దలంతా తమ ఇళ్లకు ఆడబిడ్డల పేర్లను పెట్టుకునేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు.. చదువు మాన్పించేసిన వారిని మళ్లీ బడికి పంపుతున్నారు. థ్యాంక్స్ టు నేమ్ ప్లేట్!