ఏసీబీ వలలో వీఆర్వో
పెనమకూరు (తోట్లవల్లూరు): ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. భూమి రికార్డుల పనిలో లంచం కోసం రైతును పట్టిపీడిస్తున్న పెనమకూరు వీఆర్వో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. జిల్లా ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, బాధితుడు ఈడే శ్రీనివాస్ కథనం మేరకు... మండలంలోని గరికపర్రుకు చెందిన శ్రీనివాస్‌కు కనకవల్లి వద్ద సుమారు 6.50 ఎకరాల వ్యవసాయ భూమి పిత్రార్జితంగా వచ్చింది. 2014లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రికార్డుల్లో తన పేరు ఎక్కించుకోవటంతోపాటు పట్టాదారు పాస్సుస్తకం కోసం రైతు శ్రీనివాస్ గత నెల 9న మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీ పెనమకూరు వీఆర్వో పి.రాజబాబు వద్దకు చేరింది. రికార్డుల్లో పేరు నమోదు కోసం ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు.
డబ్బు ఇవ్వకుంటే.. ఫైలు వెనక్కి
అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫైల్ వెనక్కి పంపుతానని వీఆర్వో హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో రైతు శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ డిఎస్పీ వి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు ఆదివారం మధ్యాహ్నం... వీఆర్వో రాజబాబు పెనమకూరులోని తన కార్యాలయంలో శ్రీనివాస్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. పట్టుబడిన వీఆర్వో మూడు నాలుగు నెలల క్రితం పమిడిముక్కల మండలం కృష్ణాపురం నుంచి బదిలీపై పెనమకూరుకు వచ్చాడు. నిందితున్ని సోమవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.