Pencil Stand
-
ఇప్పుడు కూడా పారేస్తారా?!
వేసవి అప్పుడే దాడి చేస్తోంది. దాహంతో చంపేస్తోంది. దాన్ని చల్లార్చుకోవడానికి మన ఫ్రిజ్‌ని కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్‌తో నింపేస్తాం. ఆపైన వాటిని ఖాళీ చేస్తాం. ఆ తర్వాత ఖాళీ అయిన ఆ సీసాలను ఏం చేస్తాం? డస్ట్ బిన్లో వేస్తాం. అలా వేయడంలో గొప్పేముంది... అందరూ చేసేది అదేగా అనుకున్నారు కొంతమంది. వాటితో ఏం చేద్దామా అని చించీ చించీ కొన్ని కొత్త వస్తువులకు రూపకల్పన చేశారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌తో ఒకరు పెన్సిల్ స్టాండ్ చేస్తే, మరొకరు ఫ్లవర్‌వాజ్ చేశారు. ఇంకొకరు జ్యూయెలరీ స్టాండ్ తయారుచేస్తే... మరొకరు దాన్ని మధ్యకు కత్తిరించి, జిప్ పెట్టి, పౌచ్లా మార్చి పారేశారు. కొందరైతే వాటికి రంగులేసి తమ చిన్నారులకు ఆట వస్తువులుగా కూడా మార్చేశారు. సృజన ఉండాలే కానీ మన కంటికి ఏదీ పనికి రానిదిగా కనిపించదు. అందుకు ఇవే ఉదాహరణ. మీ ఇంట్లోనూ వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఉండి ఉంటాయి. వాటితో మీరేం చేయగలరో, ఇతర పనికిరాని వస్తువులతో కూడా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచించండిక! -
గాజులతో పెన్సిల్ స్టాండ్
తయారు చేసి చూడండి పాత గాజులతో అందమైన పెన్సిల్ స్టాండు ఎలా చేయొచ్చో తెలుసుకుందామా! కావలసినవి: పాతగాజులు (దాదాపు ఒకే సైజులో ఉండేవి), జిగురు, దళసరి అట్ట, కత్తెర, పెన్సిల్. ఎలా చేయాలి? ఒక పెద్ద గాజును తీసుకొని దళసరి అట్టపై ఉంచండి. దానిచుట్టూ పెన్సిల్‌తో గీత గీయండి. గీతగీసిన మేరకు కత్తెరతో అట్టను కత్తిరించాలి. ఇప్పుడు ఆ గుండ్రని అట్టముక్కను ఆధారంగా చేసుకొని ఒక గాజును జిగురుతో అతికించండి. దానిపై మరొకటి... దానిపై ఇంకొకటి... అలా వాటి ఎత్తు నాలుగైదు అంగుళాలు వచ్చేవరకు గాజుల్ని వరుసగా ఒకదానిపై ఒకటి అతికిస్తూ పోవాలి. జిగురు ఆరే వరకూ గాజులు కదపకుండా చూసుకోవాలి. ఆపై పెన్సిల్ స్టాండ్ రెడీ. అందమైన డిజైన్లు ఉన్న గాజులు తీసుకుంటే మీ స్టాండు మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. ఒకవేళ గాజులు మరీ పాతగా అనిపిస్తే మీకు నచ్చిన రంగుల్లో పెయింట్ వేసి ఆరాక రంగురంగుల చమ్కీలు, పూసలు, చిన్నచిన్న అద్దాలు అతికించవచ్చు లేదా పెయింట్‌తోనే డిజైన్లూ వేసుకొవచ్చు. మీకు నచ్చిందా?