గాజులతో పెన్సిల్ స్టాండ్
తయారు చేసి చూడండి
పాత గాజులతో అందమైన పెన్సిల్ స్టాండు ఎలా చేయొచ్చో తెలుసుకుందామా!
కావలసినవి:
పాతగాజులు (దాదాపు ఒకే సైజులో ఉండేవి), జిగురు, దళసరి అట్ట, కత్తెర, పెన్సిల్.
ఎలా చేయాలి?
ఒక పెద్ద గాజును తీసుకొని దళసరి అట్టపై ఉంచండి. దానిచుట్టూ పెన్సిల్‌తో గీత గీయండి. గీతగీసిన మేరకు కత్తెరతో అట్టను కత్తిరించాలి. ఇప్పుడు ఆ గుండ్రని అట్టముక్కను ఆధారంగా చేసుకొని ఒక గాజును జిగురుతో అతికించండి. దానిపై మరొకటి... దానిపై ఇంకొకటి... అలా వాటి ఎత్తు నాలుగైదు అంగుళాలు వచ్చేవరకు గాజుల్ని వరుసగా ఒకదానిపై ఒకటి అతికిస్తూ పోవాలి.
జిగురు ఆరే వరకూ గాజులు కదపకుండా చూసుకోవాలి. ఆపై పెన్సిల్ స్టాండ్ రెడీ.
అందమైన డిజైన్లు ఉన్న గాజులు తీసుకుంటే మీ స్టాండు మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది.
ఒకవేళ గాజులు మరీ పాతగా అనిపిస్తే మీకు నచ్చిన రంగుల్లో పెయింట్ వేసి ఆరాక రంగురంగుల చమ్కీలు, పూసలు, చిన్నచిన్న అద్దాలు అతికించవచ్చు లేదా పెయింట్‌తోనే డిజైన్లూ వేసుకొవచ్చు. మీకు నచ్చిందా?