ఇప్పుడు కూడా పారేస్తారా?!
వేసవి అప్పుడే దాడి చేస్తోంది. దాహంతో చంపేస్తోంది. దాన్ని చల్లార్చుకోవడానికి మన ఫ్రిజ్‌ని కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్‌తో నింపేస్తాం. ఆపైన వాటిని ఖాళీ చేస్తాం. ఆ తర్వాత ఖాళీ అయిన ఆ సీసాలను ఏం చేస్తాం? డస్ట్ బిన్‌లో వేస్తాం. అలా వేయడంలో గొప్పేముంది... అందరూ చేసేది అదేగా అనుకున్నారు కొంతమంది. వాటితో ఏం చేద్దామా అని చించీ చించీ కొన్ని కొత్త వస్తువులకు రూపకల్పన చేశారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌తో ఒకరు పెన్సిల్ స్టాండ్ చేస్తే, మరొకరు ఫ్లవర్‌వాజ్ చేశారు.
ఇంకొకరు జ్యూయెలరీ స్టాండ్ తయారుచేస్తే... మరొకరు దాన్ని మధ్యకు కత్తిరించి, జిప్ పెట్టి, పౌచ్‌లా మార్చి పారేశారు. కొందరైతే వాటికి రంగులేసి తమ చిన్నారులకు ఆట వస్తువులుగా కూడా మార్చేశారు. సృజన ఉండాలే కానీ మన కంటికి ఏదీ పనికి రానిదిగా కనిపించదు. అందుకు ఇవే ఉదాహరణ. మీ ఇంట్లోనూ వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఉండి ఉంటాయి. వాటితో మీరేం చేయగలరో, ఇతర పనికిరాని వస్తువులతో కూడా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచించండిక!