కేసుల పెండెన్సీ తగ్గింపుపై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: ఓ అధికారిపై ఉన్న ఒత్తిడి తగ్గితే పనితీరు మెరుగుపడి బాధితులకు పూర్తిస్థాయి న్యాయం చేయగలుగుతారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు కేసుల పెండెన్సీ తగ్గింపుపై దృష్టి పెట్టారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేశారు. పోలీసు కమిషనరేట్‌కు నగర నేర పరిశోధన విభాగం గుండెకాయలాంటిది. భారీ మోసాలతో పాటు రూ.30 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన నేరాలపై ఈ విభాగం నేరుగా కేసుల్ని నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మరోపక్క స్థానిక పోలీసుస్టేషన్లలో నమోదైన ఈ స్థాయి కేసులను కూడా సీసీఎస్‌కే బదిలీ చేస్తారు.
కారణాల విశ్లేషణ, బృందాలు...
ఈ స్థాయి కేసుల దర్యాప్తు పెండింగ్‌లో ఉండటానికి పలు కారణాలుంటున్నాయి. కొన్ని సున్నితమైన కేసుల్లో న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం దగ్గర నుంచి నివేదికల రాకలో ఆలస్యం, ఫోరెన్సిక్ రిపోర్టులు పొందడంలో జాప్యం, నిందితులు దొరక్కపోవడం వంటిఅనేక కారణాలతో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు చేయలేకపోతున్నారు. వీటిని త్వరగా కొలిక్కి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీ పాలరాజు నిర్ణయించారు. తొలుత పెండింగ్ కేసుల జాబితాను రూపొందించి.. అవి ఏ కారణం వల్ల పరిష్కారం కాలేదన్న లిస్ట్ రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇది పూర్తయ్యాక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఫోరెన్సిక్ నివేదికల నుంచి పరారీలో ఉన్న నిందితుల అరెస్టు వరకు ఒక్కో పనిని ఒక్కో బృందానికి అప్పగించాలని నిర్ణయించారు. ఈ జాబితాలోని పెండింగ్ కేసులు కొలిక్కి వచ్చే వరకు ఈ బృందానికి మరో పని అప్పగించరు. అలాగే నిర్ధేశించిన సమయంలో పని పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మరోపక్క నగరంలో చైన్‌స్నాచర్లు, ఇతర నేరగాళ్లు విజృంభిస్తుండటంతో క్రైమ్ వర్క్‌ను పెంచాలని డీసీపీ తమ సిబ్బందిని ఆదేశించారు. పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరగాళ్ల కార్యకలాపాలకు చెక్ చెప్పాలని స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో సీసీఎస్ అధికారులకు బందోబస్తులు తప్పట్లేదని, అయితే సాధారణ విధులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యజమానులకు చేరుతున్న వాహనాలు...
సీసీఎస్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలరాజు తీసుకున్న తొలి ప్రయోగం మంచి ఫలితానే ఇచ్చింది. చోరీకి గురైన, నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తుతెలియనివిగా దొరికిన వాహనాల జాబితాలను అన్ని ఠాణాలకు పంపి సరిచూడమని ఆయా ఇన్స్పెక్టర్లను కోరారు. ఇలాంటివి మొత్తం 894 వాహనాల ఇంజిన్, చాసిస్ నెంబర్లు, ఇతర వివరాలను ఠాణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. సదరు వాహన యజమానులు ఆర్టీఏ ఆర్సీ పుస్తకంతో స్థానిక పోలీసు స్టేషన్‌లోని ఈ-కాప్స్‌లో ఉన్న వివరాలతో సరి చూసుకుని తమ వాహనాన్ని తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఫలితంగా వారం రోజుల్లో దాదాపు 60 మంది తమ వాహనాల ఆచూకీ కనుక్కుని తీసుకెళ్లగలిగారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని పాలరాజు నిర్ణయించారు.