ఎల్లలు దాటిన తరతరాల ప్రేమ
⇒పెందుర్తి అబ్బాయి.. స్వీడన్ అమ్మాయికి వివాహం
⇒30 ఏళ్ల క్రితం వరుడి తండ్రిదీ అదే తరహాలో పెళ్లి
⇒చూటముచ్చటగా సాగిన వివాహ తంతు
తండ్రి ప్రేమ ఎల్లలు దాటింది. ఉపాధి నిమిత్తం స్వీడన్ వెళ్లిన ఆ తండ్రి అక్కడే ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం తండ్రి నడిచిన బాటలోనే నేడు కొడుకు నడిచాడు. అదే దేశానికి చెందిన ఓ యువతిని వలచి భారతీయ సంప్రదాయంతో మనువాడాడు. ఆ జంటను ఇరుదేశాల పెళ్లిపెద్దలతో పాటు సీతారాములు ఆశీర్వదించారు.
పెందుర్తి: పెందుర్తి అబ్బాయి స్వీడన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలోని రాములవారి సన్నిధిలో ఈ జంట ఒక్కటైంది. చూడముచ్చటైన ఈ వివాహబంధం పూర్వాపరాలివి.. పెందుర్తికి చెందిన పెంటకోట అప్పారావు 40 ఏళ్ల క్రితం స్వీడన్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లిపోయారు. పదేళ్లకు అక్కడే స్థిరపడ్డ అప్పారావు ఇవా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ సంతానం. వీరిలో పెద్ద కుమారుడు జాన్ సంజీవ్ స్వీడన్ దేశానికే చెందిన ఎలిన్ లండన్ అనే యువతిని ఇష్టపడ్డాడు. విషయం ఇరువురి తల్లిదండ్రులకు చేరడంతో వారు పెళ్లికి అంగీకరించారు. అయితే తన సొంత ప్రాంతంలోనే పెళ్లి చేయాలని సంకల్పించిన పెంటకోట అప్పారావు–ఇవా దంపతులు సంజీవ్, ఎలిన్ల పెళ్లి పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలో చేయాలని నిర్ణయించారు.
బుధవారం గ్రామంలోని రామాలయంలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా సంజీవ్–ఎలిన్ల వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. సీతారాముల సన్నిధిలో సంజీవ్ తాళి కడుతుండగా ఎలిన్ సిగ్గుమొగ్గలైంది. నూతన దంపతులు ముత్యాల తలంబ్రాలు పోటాపోటిగా పోసుకుని సందడి చేశారు. పెళ్లిలో మహిళలు పట్టుచీరలు దరించి భారతీయ సంప్రదాయాన్ని సగర్వంగా చాటిచెప్పగా పురుషులు పట్టుపంచెలు దరించి ఉగాది ముందు అచ్చమైన తెలుగు సంప్రదాయాన్ని రుచి చూపించారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలిరావడం విశేషం.