ఎన్పీఎస్ కోసం 75 వేలమందికి శిక్షణ
శిక్షణ సంస్థల ఎంపికలో పీఎఫ్ఆర్డీఏ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) కోసం పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ, పీఎఫ్ఆర్డీఏ 75 వేలమందికి శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఇంత మందికి శిక్షణ ఇవ్వడం కోసం శిక్షణ సంస్థల ఎంపిక ప్రక్రియను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్డీఏ) చేపట్టింది. దేశవ్యాప్తంగా 600 జిల్లా కేంద్రాల్లో ఒక్కో సెషన్‌కు 45 మందికి చొప్పున 1,670 సెషన్లలో శిక్షణ ఇవ్వాలని తన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)లో పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది.
దాదాపు 75 వేలమందికి శిక్షణ ఇవ్వడానికి శిక్షణ సంస్థల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి ఎన్పీఎస్కు 1.14 కోట్ల మంది చందాదారులున్నారు. ఎన్పీఎస్ మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉంది. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, ఎవరైనా వ్యక్తి ఉద్యోగం/స్వయం ఉపాధి పొందుతున్న కాలంలో తమ భవిష్యత్ రిటైర్మెంట్ అవసరాల కోసం సిస్టమాటిక్ సేవింగ్స్ ద్వారా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.