Pension Rules
-
France: ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. ఎందుకీ వ్యతిరేకత?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్ టవర్‌ను మూసేశారు. పారిస్ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ పార్టీలు, ఫార్ రైట్ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు? ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్ కూడా పెన్షన్ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఎందుకీ వ్యతిరేకత? హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక మాక్రాన్ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పథకంలో సంస్కరణలివే ► రిటైర్మెంట్ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. ► 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. ► పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. ► పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ‘‘నేను ఒక కాస్మటిక్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా కార్యాలయంలో పని చేసే పరిస్థితుల్లేవు. మరో రెండేళ్లు పనిచేయాలంటే నా వల్ల కానేకాదు. ఈ పెన్షన్ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ – వర్జీనియా, మహిళా ఉద్యోగి ‘‘నేను రైల్వేల్లో పనిచేస్తాను. శారీరక శ్రమ చేయాలి. చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ పని చేస్తున్నాను.ఈ పరిస్థితుల్లో ఎన్నేళ్లు వచ్చే వరకు పని చెయ్యగలను. కనీసం 43 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం’’ – రైల్వే కార్మికుడు ఇక వృద్ధులు భారమేనా..? ► ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్ బెనిఫిట్ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది వారి కనీస అవసరాలకి ఏ మూలకూ సరిపోవడం లేదు. ► వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. ► 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది! 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అయితే, అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇందులో బ్యాంకుకు చెందిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల మీపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది. అందుకే, అక్టోబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో తెలుసుకోండి.(చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ!) ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఖాతాదారుల చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అప్రమత్తం చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు పీఎన్బీ బ్రాంచీ నుంచి కొత్త చెక్‌బుక్స్ పొందాల్సి ఉంటుంది అని తెలిపింది. అప్ డేట్ చేసిన ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌తో కూడిన పీఎన్బీ చెక్‌బుక్స్ అక్టోబర్ 1, 2021 నుంచి చెల్లుబాటు అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తప్పనిసరి చేసిన కొత్త నిబందనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు దేశంలోని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు "జీవన్ ప్రమాణ్ సెంటర్స్"లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే డిజిటల్ ఫార్మాట్లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించినట్లుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ స్థూల వేతనంలో 10 శాతం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
పెన్షన్ అనేది ప్రతీ ఉద్యోగి హక్కు
-
50 ఏళ్లకే ఇంటికి..
♦ 50 ఏళ్లు నిండగానే పనితీరుపై సమీక్ష ♦ పనితీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ ♦ ఉద్యోగుల ఫండమెంటల్, పెన్షన్ రూల్స్‌లో సవరణలు ♦ ఐదు జీవోలు సిద్ధం చేసిన చంద్రబాబు సర్కార్ ♦ సర్కార్ నియమించే సమీక్షా కమిటీలదే తుది నిర్ణయం ఆరు లక్షల మంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను షాక్‌కు గురిచేసే వార్త ఇది. పనితీరు ఆధారంగా 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపించేయబోతున్నారు. ఇకపై సర్కారుకు నచ్చిన ఉద్యోగి.. సర్కారు మెచ్చినంత కాలం మాత్రమే ఉద్యోగంలో ఉండగలుగుతాడు.. నచ్చని మరుక్షణాన ప్రయివేటు ఉద్యోగిని తొలగించినట్లు ఒక్క కలం పోటుతో తొలగించి ఇంటికి పంపించేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను దశలవారీగా తొలగించి వారి స్థానంలో తాత్కాలిక.. కన్సల్టెంట్లను తెచ్చుకోవాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు బలవంతంగా రిటైర్ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చుతూ అందుకు అనుగుణంగా ఐదు జీవోలను కూడా తయారు చేశారు. ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం పొంది సీఎస్ వద్దకు చేరిన ఆ జీవోలు త్వరలో జీవం పోసుకుని ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నాయి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగికీ.. ప్రైవేటు ఉద్యోగికీ తేడా ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగికి అనేక హక్కులుంటాయి... అన్నిటినీ మించి ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగికి అవేవీ ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అలాంటి ప్రివిలేజెస్ అన్నీ తొలగిపోనున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగులకు వారికీ ఎలాంటి తేడా ఉండదు.. అదేమిటి.. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగ విరమణవయసు కూడా 60 ఏళ్లకు పెంచారు కదా అనుకుంటున్నారా.. అది పేరుకే.. త్వరలో నిబంధనలన్నీ మారబోతున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు 50 ఏళ్లకే ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతల నుంచి బలవంతంగా రిటైర్ చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. 35 సంవత్సరాలకు ముందు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులను 50 సంవత్సరాలకే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు, 40 సంవత్సరాలు దాటిన తరువాత ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులను 55 సంవత్సరాలకే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉద్యోగుల ఫండమెంటల్ రూల్స్, పెన్షన్ నిబంధనల్లో సవరణలు చేయడానికి ఐదు ముసాయిదా జీవోలను సాధారణ పరిపాలన శాఖ రూపొందించింది. ఈ ముసాయిదా జీవోలకు ఇప్పటికే ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోద ముద్ర వేశారు. సాధారణ పరిపాలన శాఖ ఈ ముసాయిదా జీవోలను న్యాయ శాఖ పరిశీలనకు పంపించింది. న్యాయ శాఖ ఆమోదం అనంతరం తిరిగి సీఎస్ వద్దకు చేరాయి. ఉద్యోగి పనితీరుపై తరచూ సమీక్ష ప్రస్తుతం ఫండమెంటల్ రూల్స్‌లో 56వ నిబంధన ప్రకారం ప్రభుత్వ సర్వీసులోకి చేరిన ఉద్యోగి 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. అయితే ఇప్పుడు ఫండమెంటల్ రూల్స్‌లో సవరణ చేస్తూ 56 (1) పేరుతో ప్రతి ఉద్యోగి పనితీరును తరచూ సమీక్షించాలని నిర్ణయించింది. ఆ సమీక్ష ఆధారంగా ఆ ఉద్యోగిని సర్వీసులో కొనసాగించాలా లేదా బలవంతంగా పదవీ విరమణ చేయించాలనేది నిర్ణయిస్తారు. సమీక్షలో ఉద్యోగి నిజాయితీ (ఇంటిగ్రిటీ)పై అనుమానం కలిగితే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారు. అలాగే సమీక్షలో ఉద్యోగి పనితీరు (ఫెర్ఫార్మెన్స్) ఆధారంగా అసమర్ధుడని (ఇనెఫిషియెన్సీ) తేలితే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారు. ఇందుకోసం ఫండమెంటల్ రూల్స్ 56లో (2) నిబంధన పేరుతో ముందస్తు నోటీసు ఇవ్వడం లేదా మూడు నెలలు జీత భత్యాలు ఇచ్చి బలవంతంగా పదవీ విరమణ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉండేలా చేశారు. షోకాజ్ ఉండదు.. చర్చా ఉండదు.. అలాగే ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి ఆర్బిట్రేషన్ కూడా ఉండదని సవరణల్లో పేర్కొనడం గమనార్హం. ప్రతీ ప్రభుత్వ శాఖలోను అలాంటి ఉద్యోగులను సమీక్షా కమిటీలు ప్రతి ఏడాదీ గుర్తిస్తాయి. ఆ సమీక్షల ఆధారంగా ఉద్యోగుల భవితవ్యాన్ని నిర్ధారిస్తారు. బలవంతపు పదవీ విరమణ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ రూల్స్ 1980లోని సెక్షన్ (1)లో (బి) పేరుతో నిబంధనలను సవరించేందుకు ఒక జీవోను రూపొందించింది. బలవంతంగా పదవీ విరమణ చేయించే ఉద్యోగులకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిని గతంలో సుప్రీం కోర్టు సమర్ధించిందని ముసాయిదా జీవోలో స్పష్టం చేశారు. 50 సంవత్సరాలు నిండే ఉద్యోగి అంతకు ముందు పనిచేసిన ఐదేళ్ల కాలంలోని పనితీరు, అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా ఆ ఉద్యోగి భవిష్యత్‌ను సమీక్షా కమిటీలు నిర్ధారిస్తాయి. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సమీక్షకు చీఫ్ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరో ముసాయిదా జీవోను సర్కారు రూపొందించింది. ఇప్పటి వరకు ఉన్నదేమిటి? ♦ ఫండమెంటల్ రూల్స్‌లో 56వ నిబంధన ప్రకారం ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో ఉంటారు. ఇపుడు జరిగేదేమిటి? ♦ ఫండమెంటల్ రూల్స్ సవరిస్తున్నారు. దాని ప్రకారం ప్రతి ఉద్యోగి పనితీరును తరచూ సమీక్షిస్తారు. ♦ దాని ఆధారంగానే సర్వీసులో కొనసాగించాలా లేదా బలవంతంగా ఇంటికి పంపించేయాలా అనేది నిర్ణయిస్తారు ♦ నిజాయితీ, పనితీరు, సమర్థతలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తారు. ♦ ఒక్క నోటీసు ఇచ్చి, మూడునెలల జీతభత్యాలు ఇచ్చి బలవంతంగా ఉద్యోగ విరమణ చేయిస్తారు.. ♦ అసలు ఎలాంటి షోకాజు నోటీసూ ఇవ్వకుండానే బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించవచ్చు. ♦ దానిపై ఎలాంటి ఆర్బిట్రేషన్కూ వీలు లేని విధంగా సవరణలు చేస్తున్నారు. సమీక్ష వర్తించేదెవరికి? ♦ 35 సంవత్సరాలకు ముందు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగుల పనితీరును 50 ఏళ్లకు సమీక్షిస్తారు. ♦ 40 ఏళ్ల తర్వాత ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగుల పనితీరును 55 ఏళ్లకు సమీక్షిస్తారు..