ఆలయ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవికి పోటీ రసవత్తరంగా సాగుతోంది. పాలకవర్గం నియామకం కోసం ఈ నెల ఆరోతేదీన దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోమని సూచించింది. దరఖాస్తులకు గడువు ఈ నెల 26తో పూర్తికానుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ చైర్మన్ పదవి కోసం నాయకులు ఎవరికివారే ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకలాపాలు చూస్తున్న పాటిబండ్ల వెంకట్రావు ద్వారా నాయకులు చైర్మన్ పదవి కోసం కుస్తీలు పడుతున్నారు.
పదవి కోసం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి శివాజీ, అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాసిరెడ్డి బెనర్జీ ప్రధానంగా పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం వాసిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటామని ఎంపీ ముందు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివాజీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్లుగా యూత్ కాంగ్రెస్‌లో ఉంటూ పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా యువజన కాంగ్రెస్‌లో గుర్తింపు పొందిన తనకు చైర్మన్ పదవి తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంపీ హామీ ఇచ్చారని, తనకే చైర్మన్ పదవి వస్తుందని వాసిరెడ్డి చెబుతున్నారు.
కాకాని ప్రయత్నాలు...
మరోవైపు గత ంలో పాలకవర్గ చైర్మన్‌గా పనిచేసిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాకాని శ్రీనివాసరావు కూడా తనకు తిరిగి చైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారు. తనకు పదవి తప్పక వస్తుందని, రెండోసారి ఇవ్వని పక్షంలో పెనుగంచిప్రోలుకు చెందినవారికే కేటాయించాలని కోరుతున్నారు. తన మద్దతుదారుల పేరును ఆయన సూచిస్తున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి శంకర్ కూడా ఎంపీ ద్వారా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద పదవిపై ఆశ పెట్టుకున్న నేతలంతా ఎవరికివారే తామే చైర్మన్ అవుతామనే ఆలోచనతో ఉన్నారు. తిరుపతమ్మ అమ్మవారి చైర్మన్ పదవి మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.