మూడు జిల్లాల్లో రెండు లక్షల మంది తరలింపు
హుదూద్ తుఫాను ముంచుకొస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఒడిషాలోని 11 జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని తరలించేశారు. ప్రస్తుతం తుఫాను విశాఖకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని గమనం వేగంగా ఉంది. సహాయ కార్యక్రమాల కోసం 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాలు రెడీగా ఉన్నాయి. నాలుగు నౌకలు, పది హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఇప్పటికే 250 మంది సైనికులు చేరుకున్నారు.
తుఫాను బలహీనపడే అవకాశాలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ టెలికం కంపెనీలు ప్రజలకు ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కంట్రలో రూం ఏర్పాటుచేశారు. దీని నెంబర్లు 040 23456005, 23450419. మొత్తం 200కు పైగా సహాయ శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దుచేశారు. డీజిల్, పెట్రోలు నిల్వలు సిద్ధం చేయాలని ఆదేశించారు.