పోలీసులపై నమ్మకం పెంచండి
సిబ్బందికి కమిషనర్ హితబోధ
సాక్షి, సిటీబ్యూరో: ‘సిఫారసు చేస్తేగాని మన పిల్లలు సైతం ఫిర్యాదు చేసేందుకు ఠాణా మెట్లు ఎక్కే పరిస్థితి లేదు....అలాంటప్పుడు సాధారణ ప్రజలు మనపై ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు. ఇక నుంచి మీ వ్యవహార శైలిని మార్చుకోండి...ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా పనిచేయండి’... అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. పేట్లబురుజులోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్’పై జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మనల్ని (పోలీసులను) అడిగేవారు ఎవరు లేరని, మనం ఏం చెప్తే అదే నడుస్తుందనే భావనను విడనాడాలని ఆయన సూచించారు.
‘నూటికి 98 శా తం మంది ఏనాడూ పోలీసు స్టేషన్‌కు రారు... ఎప్పుడు పోలీసులతో మాట్లాడరు...వారికి మనం ఎప్పుడు అన్యాయం చేసి ఉండం... అయినా మన గురించి వారికి మంచి అభిప్రాయం లేదు... మన వద్దకు వచ్చే కొద్ది మంది బాధితులకు కూడా మనం న్యాయం చేయకపోగా, వారిని దూషించడమే దీనికి కారణం. పన్నుల రూపంలో ప్రజలు కట్టే డబ్బులతోనే మనం జీతాలు తీసుకుంటున్నాం. వారికి మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.
మీకు ఏ అవసరం వచ్చినా అండ గా మేం ఉంటాం. సదా మీ సేవలోనే ఉన్నాం.. అనే ప్రచారాన్ని చేపట్టాలి. వారిలో భరోసా పెంచడంతో పాటు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించండి’ అని కమిషనర్ అ న్నా రు. అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమా ర్, జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంగళవారం కూడా కొనసాగనుంది.
కమిషనర్ సూచనలివీ....
ఠాణాకు వచ్చిన బాధితుడితో మర్యాదగా మాట్లాడం
ఫిర్యాదు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేయడం
మేం చెప్పిందే వేదం అనే పద్ధతి మార్చుకోవడం
ఛార్జీషీట్ సకాలంలో వేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయడం
బాధితుడు ఈరోజు ఠాణాకు వచ్చినా కేసు పురోగతి చెప్పడం
ప్రజలకు ఆయా ఠాణా అధికారులు సెల్ నెంబర్లు ఇవ్వడం
ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆదుకుంటామని ధైర్యం చెప్పడంతో పాటు నమ్మకం కలిగించడం
పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు.., దర్యాప్తు చేయరనే ప్రచారాన్ని తిప్పికొట్టడం