న్యూజిలాండ్ లో తొలి మొబైల్ పోలీస్ స్టేషన్
వెల్లింగ్టన్: ఆ దేశంలో ఏదైనా అన్యాయం జరిగితే అక్కడి ప్రజలు ఇకపై తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషనే ప్రజల చెంతకు వచ్చింది. న్యూజిలాండ్‌లో తొలి మొబైల్ పోలీస్ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయాన్ని సోమవారం అక్కడి మీడియా వెల్లడించింది.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా వాహనంలోనే మొబైల్ పోలీస్ స్టేషన్ ప్రజల వద్దకు వెళుతోంది. ఈ మొబైల్ పోలీస్ స్టేషన్.. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజాసేవలకు సులభంగా ఉంటుందని సీనియర్ అధికారి డెరక్ ఆర్చెడ్ పేర్కొన్నారు. వెల్లింగ్టన్ వ్యాప్తంగాఈ మొబైల్ పోలీస్ స్టేషన్ నుంచి సేవలు అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఇలాంటి మరికొన్ని మొబైల్ పోలీస్ స్టేషన్లను ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు.
ఇక మొబైల్ పోలీస్ విభాగం వెల్లింగ్టన్కు భారీ సంపద లాంటిదని, దాంతో ప్రజలతో మమేకం కావడమే కాకుండా వారికి తక్షణమే సేవలు అందించే సౌలభ్యం ఉంటుందని చెప్పారు. మొబైల్ పోలీస్ స్టేషన్ ప్రక్రియకు సంబంధించి పనులు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయనీ, అయితే అది ఇప్పటికీ పూర్తి కార్యరూపం దాల్చిందని తెలిపారు. ఇకపై ఎక్కడి వెళ్లాలంటే అక్కడికి వెళ్లి ప్రజలతో మమేకమై, వారి అవసరాలు తీర్చగలమని చెప్పారు. ఇలాంటి మొబైల్ పోలీస్ సేవలు న్యూజిలాండ్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అయినా దీనిపై మరింత విజయం సాధిస్తామని తాము ఆశిస్తూన్నట్టు ఆర్చెడ్ తెలిపారు.