ఏదైతే అదే!
జిల్లాల పునర్విభజన.. దగాపడ్డ నారాయణఖేడ్
అభిప్రాయ సేకరణ.. మెదక్ జిల్లాలోనే ఉండాలి
లేదు.. ఎక్కడైనా పర్వాలేదు.. ఏదైనా మంచిదే కదా!..
ఖేడ్వాసుల అభిప్రాయాన్ని సేకరించిన ‘సాక్షి’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి నెట్వర్క్: జిల్లా పునర్విభజనపై రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజలు ఇంకా ఒక అంచనాకు రాలేదు. రాజకీయ నేతలు, పనిగట్టుకున్న ఒక వర్గం మాత్రమే తమ సొంత వాదనలను ప్రజాభిప్రాయంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లు తేలింది. బుధవారం ‘సాక్షి’ నెట్వర్క్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రతి మండలానికి 250 మంది చొప్పున మొత్తం 1,250 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరించింది.
కేవలం 40 శాతం మంది మాత్రమే స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా మిగిలిన 60 శాతం ప్రజలు ఏ జిల్లా అయినా ఒకటే అని చెప్పారు. ఈ 60 శాతం మందిలో ఎక్కువగా రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు ఉన్నారు. విద్యావంతులు మాత్రం మిశ్రమంగా స్పందించారు. జీవితాన్ని చదివిన అనుభవజ్ఞులు, విశ్రాంత ఉద్యోగులు ‘నారాయణఖేడ్ మెదక్ జిల్లాలోనే కలవాలం’టూ తేల్చి చెప్పారు.
ముందుకు చూద్దాం!
ఈయన పేరు వీర్శెట్టి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు. నారాయణఖేడ్ మండలం రుద్రార్కి చెందిన ఈయన ‘సంగారెడ్డిలో ఖేడ్ కలిస్తే కొత్తగా పరిశ్రమలు రావు’ అంటున్నారు. ‘అవన్నీ జహీరాబాద్‌లోని నిమ్జ్‌కి వెళ్లిపోతాయి. ఫలితంగా ఖేడ్ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది’ అని తన వాదన వినిపించారు.
‘ప్రత్యేక రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలు, ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత అవసరాలను కాకుండా ముందు తరాలు, విద్యార్థుల భవిష్యత్తును ఆలోచిస్తే మెదక్ జిల్లాలోనే నారాయణఖేడ్ చేరడం అన్నివిధాలా మేలు. అప్పుడు ఖేడ్‌లోని పడావు భూముల్లో కర్మాగారాలు ఏర్పాటవుతాయి. ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని గట్టిగా చెప్పారు.
రెండింధాలా మేలు కదా!
ఈ యువకుడి పేరు సయ్యద్ కలీం. మాసాన్‌పల్లి క్రాస్‌రోడ్డులో సైకిల్ రిపేర్‌షాపు నడుపుతున్నాడు. ఖేడ్‌ను ఏ జిల్లాలో కలపాలని అడిగినప్పుడు ‘సంగారెడ్డిలో ఉంటే అక్కడ పనులు చేసుకుని అట్నుంచటే హైదరాబాద్‌కు వెళ్తాం. ఒకే రోజు రెండు పనులు చేసుకోవచ్చు కదా! మెదక్ పోయేందుకు బస్సులు సరిగా ఉండవు’ అని తన అనుభవాన్ని వివరించాడు.
మెదక్ జిల్లాలోనే మేలు
మన పిల్లలకు నౌకరీలు దొరకాలే. కార్ఖానాలు రావాలంటే మనందరం మెదక్ జిల్లాల ఉండాలె. లేకుంటే మనదిక్కు అధికారులు రారు. మనల్ని ఎవరూ పట్టించుకోరు. - డి.రాజులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, తడ్కల్
సంగారెడ్డిలెందుకు చేరుస్తున్నరు?
మనకు దెగ్గరున్న మెదక్‌లో మనం ఉంటే బాగుంటది. కాదని సంగారెడ్డిలో చేరిస్తే పొయిరానికి దినం సరిపోదు. ఇప్పుడు బస్సులు లేకుంటే ఏమాయే. జిల్లా చేస్తే బస్సులు చాలయితయి. పనులేమయినా ఉన్నా చేసుకొని ఇంటికి రానీకి బాగుంటది. సంగారెడ్డికి ఎందుకు అంటున్నారో ఏమీ అర్థమవుతలేదు. - సాయిరెడ్డి, రైతు, ముర్కుంజాల్, కంగ్టి మండలం
మానసికంగా ‘సంగారెడ్డి’కి అలవాటు పడ్డాం
ప్రస్తుతం ఉన్న రవాణా సదుపాయాలు, విద్యాపరంగా ఖేడ్ నియోజకవర్గం సంగారెడ్డిలోనే కొనసాగితే బాగుంటుంది. హైదరాబాద్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. మానసికంగా సంగారెడ్డి జిల్లాకు అలవాటు పడ్డాం. - సంతోష్‌కుమార్, ఎస్ఏ, చాప్టా(కే) గ్రామం, కంగ్టి మండలం
మెదక్‌లోనే ఉద్యోగావకాశాలు ఎక్కువ
సంగారెడ్డిలోని పట్టణీకరణ, పోటీతత్వం ఉన్న విద్యార్థులతో ఖేడ్ విద్యార్థులు తట్టుకోలేరు. ఖేడ్, మెదక్ పిల్లల ఐక్యూ(ఇంటెలిజెంట్ కోషియంట్) స్థాయి దాదాపుగా సమానంగా ఉంది. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరగాలంటే ఖేడ్ మెదక్ జిల్లాలో కొనసాగడమే ఉత్తమం. - కాశీనాథ్‌రావు, ప్రధానోపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్ తడ్కల్, కంగ్టి మండలం
ఉపాధి పెరగాలంటే మెదక్తోనే..
కంగ్టి మండలంలోని 70 శాతం ప్రజలు వలసలపై అధారపడి జీవిస్తున్నారు. వలసలు తగ్గాలంటే కొత్త జిల్లాలో ఏర్పడే పరిశ్రమలు, అభివృద్ధి పనులతోనే స్థానికులకు బతుకుదెరువు దొరుకుతుంది. దీంతో వలసలు తగ్గుతాయి. - యశ్వంత్, ఎస్ఏ, సుక్కల్తీర్థ్ తండా, కంగ్టి మండలం
‘ప్యాకేజీ’తో లబ్ధి పొందుతాం
మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడితే మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వాలు విడుదల చేసే అభివృద్ధి ప్యాకేజీలు మన నియోజకవర్గానికి అందే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి తోడు కంగ్టిలాంటి రాళ్లరప్పల భూముల్లో పంటలు పండక రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు పరిశ్రమల అభివృద్ధితో తొలగుతాయి. మన ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. - ఎంఏ ఖాదర్, మండల కో-ఆప్షన్ సభ్యులు, కంగ్టి మండలం, తడ్కల్
మెదక్‌లో ఉంటేనే అభివృద్ధి
మెదక్ జిల్లాలో ఉంటేనే ఖేడ్ అభివృద్ధి జరుగుతుంది. 70 ఏళ్లుగా సంగారెడ్డిలో ఉంటే మనం అభివృద్ధి చెందలేదు. మన ప్రాంతం వారు ఉద్యోగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. మాకు ఉపాధి కూడా దొరక్క ఏదో పొట్టనింపుకొనే పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాం. పిల్లల బతుకులు బాగుండాలంటే చిన్న జిల్లాగా ఏర్పడుతున్న మెదక్‌లోనే ఖేడ్ ఉండాలి. - అంజి, పెయింటర్, తడ్కల్, కంగ్టి మండలం
ఎక్కడైనా సరే..
జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్ ఏదైనా సరే. కల్హేర్ మండలం నుంచి రెండు పట్టణాలకు అంతే దూరంగా ఉంటుంది. మెదక్‌కు గుర్తింపు అంతగా లేదు. - సివేందర్, ఆటోడ్రైవర్, మాసాన్‌పల్లి
పెద్దగా పట్టించుకోను..
మాసాన్‌పల్లి చౌరస్తా వద్ద పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాను. భార్య పిల్లలు లేరు. జిల్లాల ఏర్పాటు గురించి నేను పెద్దగా పట్టించుకోను. - అంబదాస్, పెట్రోల్‌బంక్ వర్కరు, హన్మంత్‌రావుపేట
ఏదైనా పర్వానై..
జిల్లా ఏదైనా పర్వానై. మెదక్ పోతే అంత బస్సు సౌకర్యం ఉండదు. రెండు మూడు చోట్ల బస్సులు ఎక్కాల్సి వస్తాది. అన్ని సౌకర్యలు కలిపిస్తే బాగుంటది. - కాషప్ప, హోటల్ యజమాని, కల్హేర్
ఇప్పటికే ఎగతెగినట్లు ఉన్నాం ..
ఉపయోగం ఉంటే ఒప్పుకోవాలి లేకుంటే లేదు. సంగారెడ్డి అంటున్నారు. కానీ ఏమైనా లాభం ఉందా..ఇప్పటికే ఎగతెగినట్లు ఉన్నాం. అభివృధ్ది లేకుంటే మరింత ఎగతెగినట్లు మారిపోతాం. - శివన్న, బాదల్గాం, మనూరు
నాకేం తెలుస్తుంది..
ఖేడ్‌ను ఎండ్ల కలిపితే నాకేంది. పనిచేస్తే తప్ప బతుకుదెరువుకాదు. అదంతా పెద్దోళ్లు చూసుకుంటారు. మేమే పని చేసుకొని బతుకుతున్నాము. జిల్లా, మండలం అనేంది మాకేమి అవసరం లేదు. - శ్యాంసన్, పుల్కుర్తి, రైతు
జిల్లా గురించి తెల్వదు..
ఏ జిల్లా అయితే ఏంది సారు?. పిల్లలకు ముందటి భవిష్యత్తు బాగుండాలి. కొలువులు రావాలి. అందరూ ఏది అంటే సర్కారు అదే చేయాలి. సర్కారోళ్లు సర్వే చేయాలి. ఆఫీసర్లు, నాయకులు వాళ్ల సేఫ్టీ చూసుకుంటరు. - గాళెప్ప, బోరంచ
సంగారెడ్డిలో ఉంటేనే బాగు..
మెదక్ కంటే సంగారెడ్డిల ఉంటేనే బాగు. ఏదైనా పనికి పోతే తెలిసిన వారు ఉంటారు. అదే మెదక్ పోతే నీళ్లు ఇచ్చేవారు కూడా ఉండరు. సమయం తప్పితే ఉత్తిదే. - నర్సింహారెడ్డి, మనూరు
అందరు ఎట్లంటే అట్లా..
కొత్త జిల్లా గురించి నాకు అస్సలే తెలియదు. ఊర్లో వారు అందరూ కొత్తగా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా అంటున్నారు. ఏ జిల్లా అయితే లాభమో తెలియదు. ఏదైతే ఏమి బతుకు దెరువు ముఖ్యం. - పోతుల అశోక్‌రెడ్డి, బెల్లాపూర్
రవాణా సదుపాయం కావాలి
సంగారెడ్డి అభివృద్ధి చెందడంతో పాటు రవాణాపరంగా అనుకూలంగా ఉంది. మెదక్‌కు రవాణా పరంగా ఇబ్బందులు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు ఏర్పడితే సంగారెడ్డి కంటే మెదక్ దగ్గరవుతుంది. ప్రాంతం అభివృద్ధి ముఖ్యం. - గోపి జైస్వాల్, జిరాక్స్‌సెంటర్ నిర్వాహకుడు, మంగల్‌పేట
జనానికి మేలు జరగాలి
జిల్లా ఏర్పాటుతో జనాలకు మేలు జరగాలి. నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇక్కడ అభివృద్ధి జరగాల్సి ఉంది. అందుకు ఏది బాగైతే సర్కారు అదే చేయాలి. - ఉప్పరి గోపాల్, మెకానిక్, అతిమ్యాల్
ఏదైనా సరే..
జిల్లా ఏదైనా సరే. సంగారెడ్డి, మెదక్ ఏది చేసినా మంచిగనే ఉంటుంది. ఇక్కడ పనులు దొరకవు.పనులులేక జనం గోస పడుతుండ్రు. చదువుకున్నోళ్లకు పనులు దొరికేలా ఉంటేనే లాభం. - నాగరాజు, దాబా నిర్వాహకుడు, నారాయణఖేడ్