బెనిన్ వందపూల వికాసం!
ఫ్రాన్స్ అధీనంలో ఉన్న బెనిన్‌ను 1975 వరకు ‘దహేమీ’ అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ దేశం బానిసల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బానిసలను కొనడానికి ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రాంతానికి సంపన్నులు వచ్చేవారు. 1960లో ఫ్రాన్సు నుండి బెనిన్‌కు స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం మాట ఎలా ఉన్నా... 1972 వరకు బెనిన్ అంతర్యుద్ధాలతో అల్లాడిపోయింది. మార్క్సిస్ట్-లెనినిస్ట్ పాలకుల పాలనలో 1975లో బెనిన్ ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బెనిన్’గా అవతరించింది. 1990 మార్చి 1న ‘రిపబ్లిక్ ఆఫ్ బెనిన్’గా మారింది.
పశ్చిమ ఆఫ్రికాలోని ఈ చిన్న దేశం ప్రకృతి పరంగా చెప్పుకోవాలంటే పెద్దది, విశిష్టమైనది. నోకా, పోరోటనోవో లాంటి గొప్ప సరస్సులు ఈ దేశంలో ఉన్నాయి. ఈ సరస్సులకు ఉత్తర భాగంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. దేశానికి ఉత్తర భాగంలో అటకోరా పర్వతాలు, పచ్చని గడ్డితో ఉన్న సవన్నా పీఠభూములు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 12 భాగాలుగా విభజించారు. వీటిని డిపార్ట్మెంట్లు అంటారు. ఈ డిపార్ట్మెంట్లను మళ్లీ 77 కమ్యూన్లుగా విభజించారు. 42 ఆఫ్రికన్ తెగల ప్రజలు ఈ దేశంలో నివసిస్తున్నారు. ప్రజల్లో దాదాపు 50 శాతం ఫ్రెంచ్ భాషనే మాట్లాడతారు.
బెనిన్ దేశ రాజధాని పోర్టోనోవోను ‘హాగ్‌బోనోవ్’ అని కూడా పిలుస్తారు. పోర్టోనోవో మ్యూజియంలో రాజుల వస్తువులు, దుస్తులు, కళాకృతులు ఉన్నాయి. టోఫా రాజభవంతి ప్రత్యేక ఆకర్షణ. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రకృతి అందాల వల్ల ఈ దేశానికి వచ్చే పర్యాటకులు ఎక్కువే. పెండ్జారీ నదీ తీరంలో ఉన్న ‘పెండ్జారీ జాతీయపార్క్’ సహజమైన పార్క్‌గా పేరు పొందింది. ఈ పార్క్‌లో అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఏనుగులు 800 వరకు ఉన్నాయి. అడవి దున్నలు, కోతులు మొదలైనవి వేలసంఖ్యలో ఉన్నాయి.
బెనిన్లోని అబోమీ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నగరం చుట్టూ మట్టిగోడ కట్టి ఉంటుంది. ఈ మట్టి గోడకు ఆరుచోట్ల ఆరు ద్వారాలు ఉన్నాయి. ఎన్నో రాజభవనాలు ఉన్న ఈ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. బెనిన్‌కు బలమైన సంప్రదాయ మౌఖిక సాహిత్య సంపద ఉంది. ఫ్రెంచ్ భాష ఆధిపత్యం ఉన్నప్పటికీ మౌఖిక సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నాయి. వలస పాలన, అంతర్యుద్ధాల ప్రభావంతో బెనిన్ ఇంకా అభివృద్ధి చెందని దేశాల జాబితాలోనే ఉంది. దేశంలో అత్యధికులు నేటికీ దారిద్య్రరేఖకు దిగువనే నివసిస్తున్నారు.
టాప్ 10
1. బెనిన్‌లో వివిధ వ్యాపారాలలో భారతీయులు ప్రముఖ స్థానంలో ఉన్నారు.
2. మనషులను బలి ఇచ్చే సంప్రదాయం ఒకప్పుడు దేశంలో బలంగా ఉండేది.
3. బెనిన్ దేశపటం ఐస్‌క్రీమ్ కోన్ ఆకారంలో ఉంటుంది.
4. కోటోనోవ్ దేశంలో అతి పెద్ద నగరం. బెనిన్‌కి ఆర్థిక రాజధాని.
5. బెనిన్‌లో పొడవైన నది వ్యోమె.
6. బెనిన్‌లో పాపులర్ క్రీడ ఫుట్‌బాల్.
7. ఈ దేశ జాతీయపతాకంలోని ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులలో ఆకుపచ్చరంగు ఆశావాహదృక్పథాన్ని, ఎరుపు పూర్వీకుల ధైర్యసాహసాలను, పసువు రంగు సాంస్కృతిక సౌభాగ్యాన్ని సూచిస్తాయి.
8. బెనిన్‌లో ఎక్కువమంది రైతులే.
9. దేశంలో అక్షరాస్యత 42.4 శాతం.
10. జంతువులు, ఆత్మలను ఆరాధించే సంస్కృతి ప్రజల్లో ఎక్కువగా ఉంది.
దేశం బెనిన్
ఫ్రాన్సు నుంచి
స్వాతంత్య్రం 1 ఆగస్ట్ 1960
రాజధాని పోర్టో-నోవో
అధికార భాష ఫ్రెంచ్
కరెన్సీ సీఎఫ్ఏ ఫ్రాంక్
జనాభా కోటి 8 లక్షల 79 వేల 829 (సుమారుగా)