స్వయంపాలనే ప్రజల ఆకాంక్ష
ఆలేరు, న్యూస్‌లైన్: స్వయంపాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆలేరు జెడ్పీ మైదానంలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదు దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందన్నారు. నీరు, నిధుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లుకు సంబంధించిన పత్రాలను చించివేసినంత మాత్రాన సీమాంధ్రులకు ఒరిగిందేమీ లేదన్నారు. సీమాంధ్ర నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.
371(డి), తెలంగాణ ఏర్పాటు అంశానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. శాసనసభలో టీడీపీ పాత్ర విడ్డూరంగా ఉందన్నారు. సమన్యాయం అంటే ఏమిటో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాకే సంబరాలు చేసుకుంటే బాగుంటుందన్నారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో పైళ్ల ఫౌండేషన్ చైర్మన్ పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ,ఆలేరు జేఏసీ చైర్మన్లు పూస శ్రీనివాస్, సుంకరి సత్యనారాయణ, నిర్వాహకులు సుంకరి ప్రదీప్, ఆలేటి శ్రీకాంతాచారి, మామిడాల భాను, పీఇటీలు పూల నాగయ్య, మధుసూదన్, అంగడి అరవింద్, సృజన్, విద్యాసాగర్, కృష్ణ, బెజ్జం బాలకిషన్ పాల్గొన్నారు.