Pepsi Company
-
పెయిడ్ లీవ్స్ లేనివాళ్లను చూస్తే ఆందోళనగా ఉంది’
పెప్సీకో వంటి అంతర్జాతీయ బ్రాండ్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేసి సంస్థను లాభాల్లో పెట్టిన వనితగా ఇంద్రానూయికి పేరుంది. ఇరవై ఐదేళ్ల పాటు పెప్సీకోలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమె 2018లో సీఈవోగా అక్కడ రిటైర్ అయ్యారు. అయితే ఒక ఉద్యోగి జీవితంలో పెయిడ్ లీవ్స్ ప్రాముఖ్యత ఎంత ఉంటుందనే అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమె చెప్పుకొచ్చారు... నా కెరీర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో పని చేస్తున్నాను. అప్పుడు మా నాన్నకి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. నేను ఆయన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో పెయిడ్ లీవ్స్ అడిగితే ముందు కుదరదని చెప్పారు. దీంతో నా జీవితం ఒక్కసారిగా డోలాయమానంలో పడింది. ఓ వైపు తండ్రి ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, మరోవైపు జాబ్ వదిలేయాల్సిన పరిస్థితి. ఏం చేయాలో పాలుపోలేదు అంటూ ఆనాటి రోజులను ఇంద్రానూయి జ్ఞాపకం చేసుకున్నారు. చివరకు ఎలాగోలా మా నాన్నను చూసేందుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న చనిపోయారు. ఈ సమయంలో కంపెనీ నాకు ఆరు నెలల పాటు పెయిడ్ లీవ్ మంజూరు చేసింది. అయితే నాన్న అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే మూడు నెలల రెండు రోజుల తర్వాత నేను తిరిగి విధుల్లో చేరాను. నాకు అవసరం లేకపోవడంతో దాదాపు మూడు నెలల పాటు పెయిడ్ లీవ్స్ వదులుకున్నాను. కంపెనీ నాకు పెయిడ్ లీవ్స్ నిరాకరించడం, ఆ తర్వాత మంజూరు చేయడం, పనిపై మక్కువతో నేను పెయిడ్ లీవ్స్ పూర్తిగా వాడుకోకపోవడం వంటివి అసాధారణ విషయాలేమీ కాదు. కానీ కనీసం పెయిడ్ లీవ్స్ ఉంటాయని తెలియని వాళ్లు, పెయిడ్లీవ్స్ లేకపోయినా అనేక కష్టాల మధ్య ఉద్యోగాలు చేసే వాళ్లని తలచుకుంటేనే నాకు బాధగా ఉందంటూ తెలిపారు ఇంద్రానూయి. కంపెనీ అభివృద్ధికి అహార్నిషలు పని చేసే ఉద్యోగులకు కష్టకాలంలో అక్కరకు వచ్చేలా పెయిడ్ లీవ్స్ ఉండాలనే అర్థంలో అమె కామెంట్లు చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంద్రనూయి లాంటి పేరొందిన సీఈవో నోట పెయిడ్ లీవ్స్‌పై వ్యాఖ్యలు రావడం కార్పోరేట్ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించినంత వరకు శుభపరిణామం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: Indra Nooyi: మన్మోహన్సింగ్, బరాక్ ఒబామా.. ఆ రోజు ఎన్నడూ మరువలేను -
మట్టి రుణం ఇలాగ తీరింది
రైతుకు తెలిసిందేమిటి? దుక్కి దున్నడం... విత్తు నాటడం. కలుపు తీయడం... పంటను రాశిపోయడం. ఒళ్లు వంచి శ్రమించడం... మట్టిలో బంగారం పుట్టించడం. మరి... అలాంటి రైతుకు చట్టాల కష్టాలేమిటి? తన పొలంలో ఏం నాటాలో ఏం నాటకూడదో ఒకరు చెప్పేదేమిటి? రైతు మీద ఈ ఆంక్షలేమిటి? తనకు తెలియకుండానే తన మీద కేసు పెడితే ఏం చేయాలి? విదేశీ శక్తుల చేతిలో మనరైతు బలవుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? తనకంటూ హక్కులున్నాయని రైతుకు చెప్పేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క పోరాటంతో సమాధానం వచ్చింది. ఆ సమాధానమే జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో సింఘు బోర్డర్లో జరిగిన రైతుల ఆందోళనను దేశం యావత్తూ గుర్తించింది. రైతులకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుంది. మౌనంగానే అయినా మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటించింది. కార్పొరేట్ శక్తుల కోరల్లో రైతులు చిక్కుకోకూడదని చిత్తశుద్ధితో కోరుతుంది. అయితే అంతకంటే ముందు ఓ దశాబ్ద కాలంపాటు అమాయకమైన రైతులు కొందరు విదేశీ కార్పొరేట్ శక్తితో ఎదురొడ్డి పోరాడలేక, పోరాటం ఆపలేక సతమతమయ్యారు. వారు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని న్యాయస్థానానికి తెలియచేయడం కోసం స్వయంగా సదరు విదేశీ కంపెనీ మీద కేసు వేశారు రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. విదేశీ కంపెనీ మనదేశ రైతులను కబళించడానికి పన్నిన కుట్రను న్యాయస్థానానికి విశదపరిచారామె. రైతుల పక్షాన ఉన్న న్యాయం ఏమిటో తెలియచేశారు. ఫలితంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రైతులకు రక్షణగా నిలిచింది. లేస్ చిప్స్ తయారు చేయడానికి అవసరమైన ఎఫ్ ఎల్ – 2027 బంగాళాదుంప పండించిన రైతుల మీద పెప్సీ కంపెనీ కేసు పెట్టింది. తమ కంపెనీతో అంగీకారం కుదుర్చుకోకుండా ఆ పంట పండించిన కారణంగా సదరు రైతులు తమకు కోట్లాదిరూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కవిత న్యాయపోరాటం ఫలితంగా న్యాయస్థానం సదరు కంపెనీకి ఇచ్చిన పీవీపీ సర్టిఫికేట్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఒకవైపు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఉన్న బడా కార్పొరేట్ సంస్థ... మరోవైపు అసంఘటితంగా ఉన్న రైతులు. ఇలాంటి స్థితిలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వారి పట్ల సానుభూతి ఉంటే సరిపోదు. అంతకు మించిన ధైర్యం ఉండాలి. అంతకంటే ఎక్కువగా రైతు కష్టాలు, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ కంపెనీల వ్యవహార ధోరణి పట్ల స్పష్టమైన అవగాహన కూడా ఉండాలి. గుంటూరులో పుట్టిన తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాత్రమే వ్యవసాయరంగం గురించి తెలుసుకున్నానని చెప్పారామె. మహిళారైతులే స్ఫూర్తి ‘‘నాకు వ్యవసాయం గురించి మెదక్జిల్లాలోని పస్తాపూర్ మహిళలు నేర్పించారు. పీజీలో ఫీల్డ్ స్టడీ కోసం డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) తో కలిసి పని చేశాను. నిజానికి నేను కమ్యూనికేషన్స్ స్టూడెంట్‌ని. డాక్యుమెంటరీ కోసం ఆ ఊరికి వెళ్లి వ్యవసాయం చేసే మహిళలను దగ్గరగా చూశాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను కూడా అక్కడ పరిచయం చేశాం. ఒక కొత్త విధానాన్ని చక్కగా అర్థం చేసుకుని సమష్టిగా పని చేసుకుంటారు వాళ్లు. వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు తమ సమస్యలను నేర్పుగా చక్కబెట్టుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మన ఇళ్లలో మగవాళ్లకు ఒకరకం న్యాయం, మహిళలకు మరోరకమైన న్యాయం ఉండడం నాకు మింగుడుపడేది కాదు. బాల్యం నుంచి నన్ను వెంటాడిన అనేక ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరికింది. ఇక ఎం.ఏ పూర్తి కాగానే పస్తాపూర్‌కి వెళ్లిపోయాను. ఆరేళ్లపాటు అక్కడ పని చేసి ఢిల్లీకి వెళ్లి అనేక సంస్థలతో పని చేశాను. ప్రస్తుతం బెంగళూరు నుంచి పని చేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పని చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగమూ చేయలేదు... కానీ ఈ మూడు రంగాల మీద చక్కటి అవగాహన ఉంది. భావసారూప్యం కలిగిన వాళ్లం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పని చేస్తున్నాం. అవసరమైన చోట వీథి పోరాటం చేస్తాం, అలాగే ప్రభుత్వానికి విధాన రూపకల్పన కోసం నివేదికలు ఇస్తాం, అవి దుమ్ముకొట్టుకుని పోతున్నాయనిపిస్తే వాటి అమలు కోసం ఉద్యమమూ చేస్తాం’’ అన్నారామె. కేసు ఈ నాటిది కాదు! పెప్సీ కంపెనీ రైతుల మీద 2008లో తొలిసారి కేసు పెట్టింది. నిందితులు విధిలేక తలకెత్తుకున్న న్యాయపోరాటం ఇది. ఇందుకోసం తమ శక్తికి మించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ అప్పట్లో తగినంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. వార్తా కథనాలు కూడా పెద్దగా రాలేదు. ‘‘మేము రైతులకు మద్దతుగా పోరాటం మొదలు పెట్టిన వెంటనే చేసిన ప్రధానమైన పని ఈ అంశానికి విస్తృతంగా ప్రచారం కల్పించడమే. మనదేశంలో మంత్రులకు, అనేక సంస్థలకు ఉత్తరాల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేశాం. సోషల్ మీడియా ద్వారా యూఎస్, యూరప్, యూకే, ఆఫ్రికా దేశాలకు కూడా తెలిసి వచ్చింది. సదరు కంపెనీ మన రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే భావన అందరిలోనూ కలిగింది. మన ప్రభుత్వాల మీద, ఆ కంపెనీ మీద ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురాగలిగాం. వాస్తవాల అన్వేషణ కోసం పంజాబ్, గుజరాత్లో మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లాం. ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2019, జూన్‌లో స్వయంగా కేసు వేశాను. రైతులకు అనుకూలంగా వచ్చిన తీర్పు వెనుక ఇంత ఎక్సర్సైజ్ జరిగింది’’ అని చెప్పారు కవిత కురుగంటి. గడచిన గురువారం నాడు హైదరాబాద్, ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో జరిగిన ‘రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పబ్లిక్ హియరింగ్’ కోసం వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ఈ తీర్పు గొప్ప విజయమే... కానీ! ‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ – 2001’ ప్రకారం రైతులు తమకు ఇష్టం ఉన్న పంటను పండించుకోవచ్చు. ఈ మేరకు మనదేశం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగానే చట్టానికి రూపకల్పన చేసింది. అయితే రైతులకు మాత్రం ఆ విషయం తెలియదు. ఆ కారణంగానే పెప్సీ కంపెనీ రైతుల మీద కేసు వేయగలిగింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా రైతులకు తమకు హక్కులున్నాయని తెలిసింది. ఈ విషయంలో పెప్సీ కంపెనీ కేసు వేయడానికి ముందు సదరు రైతులకు తెలియకుండా వారు పండిస్తున్న బంగాళాదుంపల శాంపుల్స్ సేకరించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించింది. అది కూడా నేరమే. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడితే పోరాడే శక్తులున్నాయని కార్పొరేట్ కంపెనీలకు ఈ తీర్పు ద్వారా తెలిసి వచ్చింది. ఇది నిజంగా ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వాలు కూడా ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆశించవచ్చు. అయితే 30 నెలల పాటు జరిగిన ప్రొసీడింగ్స్నీ, తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే కొంత ఊగిసలాట కూడా ఉన్నట్లనిపిస్తోంది. ఆ కంపెనీ అగ్రిమెంట్ పూర్తి కావస్తోంది. ఈ దఫా అగ్రిమెంట్లో మరింత పక్కాగా కంపెనీకి ప్రయోజనకరంగా నిర్ణయం తీసుకునే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది. అందుకే అలాంటిది జరిగితే మళ్లీ పోరాడడానికి సిద్ధమవుతున్నాం. – కవిత కురుగంటి, కన్వీనర్, అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
కోకాకోలా, బిస్లేరి, రామ్‌దేవ్‌బాబాకు షాక్: కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది. మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. -
బామ్మకు ప్రేమతో..
లండన్ : వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడిన మ్యాచ్‌లో భారత విజయాన్ని ఆస్వాదిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన 87 ఏళ్ల చారులతా పటేల్‌కు పెప్పీ కంపెనీ తన డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం కల్పించింది. భారత అభిమానిగా బామ్మ ఆనందంతో కేరింతలు కొట్టిన క్రమంలో మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏకంగా స్టాండ్స్‌లోకి వచ్చి చారులతా పటేల్‌ను కలిసిన సంగతి తెలిసిందే. వయసు మీద పడినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె చూపిన స్పిరిట్‌కు గౌరవంగా బ్రాండ్ పెప్సీ ఆమెతో డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యంపై కలిసి పనిచేస్తుందని పెప్సీ కో ఓ ప్రకటనలో పేర్కొంది. ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయమని తెలిపింది. కాగా తాను భారత క్రికెట్ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నానని, 1983లో కపిల్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడిన సమయంలో తాను అదే స్టేడియంలో ఉన్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. -
పెప్సీకి అడ్డదారిలో పన్ను రాయితీ ?
అర్హత లేని పరిశ్రమలకూ రాయితీల పంట నెగటివ్ లిస్ట్‌లోని పెప్సీ కంపెనీకి వ్యాట్ రాయితీ కల్పించేందుకు యత్నాలు ఎస్ఐపీసీ ఎజెండా నుంచి చివరి నిమిషంలో వ్యాట్ రాయితీ ప్రతిపాదన వెనక్కి నేరుగా ఆర్థిక శాఖకు ఫైలు పంపేందుకు రంగం సిద్ధం చక్రం తిప్పుతున్న ప్రభుత్వ పెద్దలు సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలకు రాయితీల విషయంలో వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడుంటే ఏమిటన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పారిశ్రామిక విధానానికి భిన్నంగా పలు పరిశ్రమలకు అదనపు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా అర్హత లేని కంపెనీకి సైతం పన్ను రాయితీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో పెప్సీ కంపెనీ నెలకొల్పనున్న కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్‌కు రాయితీల విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. పారిశ్రామిక విధానం 2010-15 ప్రకారం.. కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్‌కు రాయితీలు ఇచ్చేందుకు వీలు లేదు. పారిశ్రామిక విధానంలో ఈ పరిశ్రమను నెగటివ్ లిస్టు జాబితాలో చేర్చారు. నెగటివ్ లిస్టులోని పరిశ్రమలకు రాయితీలు ఇచ్చిన సందర్భాలు గత పదేళ్లలో ఎన్నడూ లేవు. అయితే, పెప్సీ కంపెనీకి ఎలాగైనా రాయితీలు ఇచ్చేందుకు వీలుగా సంబంధిత రాయితీ ప్రతిపాదనలను ఆగస్టు 28న జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్ఐపీసీ) ముందుంచకుండానే.. నేరుగా ఆర్థిక శాఖకు ఫైలును పంపాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పరిశ్రమల శాఖ పావులు కదుపుతోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే అర్హత లేకున్నా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కానున్న ఇసుజూ కార్ల యూనిట్‌కు 135 శాతం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాయితీని ప్రభుత్వం కల్పించింది. మెదక్ జిల్లాలో నెలకొల్పనున్న మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్‌కు 50 శాతానికి బదులుగా ఏకంగా 100 శాతం వ్యాట్ రాయితీని ప్రభుత్వం కల్పించింది. ఈ వ్యవహారాల్లో భారీగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎస్ఐపీసీని కాదని...! వాస్తవానికి ఏదైనా పరిశ్రమకు రాయితీ ఇవ్వాలంటే సంబంధిత ప్రతిపాదనను పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ముందుంచుతుంది. ఆర్థిక శాఖతో పాటు వాణిజ్య, ఇంధన, రెవెన్యూ, మునిసిపల్ శాఖలతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శులు కూడా ఈ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పారిశ్రామిక విధానం మేరకు ఏయే పరిశ్రమలకు ఎంత రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని విశదీకరిస్తూ, అందుకు అనుగుణంగా ఎస్ఐపీసీ నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ముందుకు ప్రతిపాదనలు వెళతాయి. ఎస్ఐపీబీలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా భాగస్వాములవుతారు. వాస్తవానికి ఎస్‌ఐపీసీతో పాటు ఎస్ఐపీబీ ఆమోదం లభించిన తర్వాతే సదరు పరిశ్రమకు రాయితీలను మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేస్తుంది. ఇందుకు భిన్నంగా రాయితీలు ఇవ్వడం అనేది పారిశ్రామిక విధానాన్ని అవహేళన చేయడమే అవుతుంది. అయితే, పెప్సీ కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తోంది. పైగా ఎస్ఐపీసీ సమావేశంలో ఎజెండాలో ఉన్న పెప్సీ కంపెనీ రాయితీల ప్రతిపాదనను... చివరి నిమిషంలో ఎజెండా నుంచి తొలగించారు. ఫైలును నేరుగా ఆర్థిక శాఖకు పంపాలని ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పెప్సీ యూనిట్‌కు రాయితీల విషయంపై ఆర్థిక శాఖకు పంపేందుకు పరిశ్రమల శాఖ ఫైలును సిద్ధం చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.