perada tilak
-
‘అచ్చెన్నాయుడి ఎన్నిక చెల్లదు’
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెరాడ తిలక్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు పోటీచేసిన గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్‌ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తిలక్ డిమాండ్ చేశారు. 2007 జూలై 21న మైనింగ్ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో దాచినందుకు ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే చర్యలు తీసుకుని.. ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చివరి వరకూ న్యాయం పోరాటం చేస్తానని పేరాడ తిలక్ తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్రమంగా ఎన్నికయ్యారంటూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలోనే తెలిపిన విషయం తెలిసిందే. -
తిలక్ నామినేషన్‌కు ఉప్పొంగిన జనతరంగం
సాక్షి, టెక్కలి/టెక్కలి రూరల్: నేల తల్లి ఈనేలా.. నింగి ఒంగి చూసేలా.. ప్రత్యర్థుల గుండెలు అదిరేలా.. ఇన్నాళ్లు అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు విసిగిన ప్రజలంతా ఒక్కసారిగా జై జగన్.. జైజై తిలక్ అంటూ మిన్నంటిన నినాదాలతో జనతరంగం ఉప్పొంగింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ గురువారం చేపట్టిన నామినేషన్ కార్యక్రమానికి టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల నుంచి ఊరు.. వాడా కదిలింది. నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి రావడంతో పట్టణం నలుమూలలు కిక్కిరిసిపోయాయి. ముందుగా తిలక్ స్థానిక మెళియాపుట్టి రోడ్ జంక్షన్‌కు చేరుకోగానే ప్రజలంతా డప్పు వాయిద్యాలతో పూల దండలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలతో చేరీవీధిలోని కిల్లి పోలమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. పేరాడ, ఆయన భార్య భార్గవితో పాటు పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల జోష్ కిల్లి పోలమ్మతల్లి ఆలయం నుంచి టెక్కలి మెయిన్ రోడ్ మీదుగా అశేష ప్రజానీకం నడుమ వారి ఆశీస్సులు అందుకుంటూ తిలక్ ర్యాలీ ముందుకు సాగింది. జై జగన్.. జైజై తిలక్.. జైజై దువ్వాడ అంటూ దారి పొడవునా నినాదాలు మిన్నంటాయి. డప్పు వాయిద్యాలతో, డీజే శబ్ధాలతో కొనసాగిన ర్యాలీలో కార్యకర్తలు, ప్రజలు డ్యాన్సులు చేస్తూ హోరెత్తించారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి తిలక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించి, నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి యర్ర చక్రవర్తి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, యువజన అధ్యక్షుడు పి.రాజేంద్ర, నందిగాం జెడ్పీటీసీ సభ్యుడు కె.బాలకృష్ణ, పలాస జెడ్పీటీసీ సభ్యురాలు పి.భార్గవి, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు బలగ ప్రకాశ్, కె.జగన్నాయుకులు, నాయకులు రొక్కం అచ్యుతరావు దొర, బోయిన నాగేశ్వర్రావు, టి.జానకీరామయ్య, గురునాథ్ యాదవ్, దువ్వాడ వాణి, సింగుపురం మోహనరావు, ఎన్.శ్రీరామ్ముర్తి, కె.సతీష్, బి.హరి, టి.కిరణ్, చిన్ని జోగారావు, కె.నారాయణమూర్తి, చింతాడ గణపతి, ఎస్.ఉషారాణి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏరా.. పోరా.. నాయకుడు అవసరమా? ‘ఏరా.. మీరు నాకేమైనా ఓటు వేశారా? మీకెందుకు నేను పనిచేయాలి’ అంటూ ప్రజలపై విరుచుకుపడే అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు మనకు అవసరమా? అని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. తిలక్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి అంబేడ్కర్ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజలను, అధికారులను ఏరా.. పోరా అంటూ తిట్టే అచ్చెన్న లాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో సంక్షేమ పథకాల్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, జిల్లాలో ఇసుక మాఫీయాకు అచ్చెన్నాయుడే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఇటువంటి అవినీతి పాలనకు చరమగీతం పాడాలని దువ్వాడ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడుతూ... వైఎస్ జగన్ అంటే కార్యదీక్ష అని అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె కోరారు. ప్రజలను రోడ్డున పడేశారు.. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ... రోడ్డు విస్తరణ పేరుతో కోట్లాది రూపాయలు కాజేసిన అచ్చెన్నాయుడు పేద ప్రజలను నడిరోడ్డున పడేశారని గుర్తుచేశారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మినీస్టేడియం, 100 పడకల ఆస్పత్రి, మహిళా కళాశాల, హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా టీడీపీ నాయకులకు లాభం చేకూర్చే పనులపైనే దృష్టి పెట్టారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా ఉండాలంటే యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని తిలక్ కోరారు. -
మహిళల్ని కించపరచిన అచ్చెన్నాయుడు ఖబడ్దార్
శ్రీకాకుళం ,టెక్కలి: ‘మహిళల్ని కించపరచిన అచ్చెన్నాయుడు ఖబడ్డార్... ప్రజలంటే నీకంత చులకనభావమా... పద్ధతి మార్చుకోకపోతే తగిన బుద్ధి తప్పదు... మహిళల పట్ల హీనంగా వ్యాఖ్యానించిన ఈయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి’ అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలసి స్థానిక అంబేడ్కర్ కూడలిలో మానవహారం చేపట్టారు. స్థానికంగా మంత్రి అక్రమాలకు ప్రజలు విసిగిపోయారని, దీన్ని భరించలేక మహిళల్ని ఇష్టానుసారంగా ధూషిస్తున్నారని, ఈయనకు గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. మంత్రి అచ్చెన్న డౌన్‌డౌన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలో సమస్యలు తెలుసుకుని, టీడీపీ ప్రభుత్వం చేతిలో బలైపోయిన సామాన్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులంతా స్థానిక చేరీవీధిలో కిల్లిపోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి పాదయాత్ర కొనసాగించారు. ఇందులో భాగంగా చిన్నచేరీవీధి, పెద్దచేరీవీధి, గొడగలవీధి, గందరగోళంవీధి, కుమ్మరివీధి, రెడ్క్రాస్వీధి, అక్కపువీధి వరకు దారి పొడవునా సమస్యలు తెలుసుని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, మండల కన్వీనర్ బీ గౌరీపతి, పట్టణాధ్యక్షుడు టీ కిరణ్, నాయకులు వై చక్రవర్తి, ఎన్ శ్రీరామ్ముర్తి, టీ జానకీరామయ్య, సత్తారు సత్యం, చింతాడ గణపతి, బీ హరి, రమణబాబు, ఎం రమేష్, గురునాథ్యాదవ్తోపాటు టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి పాదయాత్ర జరిగే ప్రాంతాలు: పట్టణంలో కోదండరామవీధి, కండ్రవీధి, తెలుకలవీధి, బీసీకాలనీ, తదితర ప్రాంతాల్లో గురువారం పాదయాత్ర నిర్వహించనున్నట్లు పట్టణాధ్యక్షుడు టీ కిరణ్ తెలిపారు. -
‘దందాలకు కేరాఫ్ అడ్రస్ ఆ మంత్రి’
కోటబొమ్మాళి: రాష్ట్రంలో ఏ దందా జరిగినా రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన పాత్ర వహిస్తూ దందాలకు కేరాఫ్‌గా మారారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ విమర్శించారు. శుక్రవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేసే దందాలు రోజురోజుకు మీడియాద్వారా బహిర్గతం అవుతున్నాయని ఆరోపించారు. అమరావతిలో ఉన్న భూములు వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లకు ముడుపులు కట్టబెట్టడం వల్ల కేబినెట్లో బి–గ్రేడ్ మంత్రిగా దిగజారిన అచ్చెన్నాయుడుకు మంత్రి వర్గంలో ప్రమోషన్ కల్పించారని దుయ్యబట్టారు. ఇసుక, లిక్కర్ దందాలతోపాటు నయీమ్‌తో వ్యవహారాలు నడపడం ద్వారా అన్ని అక్రమదారుల్లో ప్రధాన భూమిక పోషించారని ధ్వజమెత్తారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులకు గతంలో నైతిక విలువలు ఉండేవని.. ప్రజల పక్షాన సమస్యలపై పోరాడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు దందాలు, కబ్జాలు, లిక్కర్ మాఫియాకు, నయీమ్ వంటి దుర్మార్గులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఎద్దేవా చేశారు. మంత్రిగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి్సన అచ్చెన్న.. అవినీతికి అడ్డాగా మారారని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎస్.హేమసుందరరాజు, పార్టీ నాయకులు పేడాడ వెంకటరావు, దుబ్బ సింహాచలం, కాళ్ల గణపతి, ఎస్.వినోద్, ఎం.భాస్కరరెడ్డి, జి.సూర్యప్రకాశ్, మూల అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.