ఆదుకోండి
► పీఎంకు పన్నీరువేడుకోలు
► అమ్మకు భారతరత్న
► కాంస్య విగ్రహం ఏర్పాటుకు వినతి
► ఢిల్లీలో పన్నీరు
► రాజకీయ ప్రశ్నలకు దాటవేత
వర్దా సృష్టించిన ప్రళయ తాండవంతో చోటు చేసుకున్న నష్టం నుంచి గట్టెక్కించేందుకు తమిళనాడును ఆదుకోవాలని సీఎం పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మోదీని ఢిల్లీలో కలుసుకున్న పన్నీరు సెల్వం వర్దా నష్టంపై నివేదిక, తమిళనాడును ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. అమ్మ జయలలితకు భారతరత్న ప్రకటించాలని, నిలువెత్తు కాంస్య విగ్రహం పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలని విన్నవించారు.
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీరు సెల్వం ప్రప్రథమంగా సోమవారం ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లినా, పూర్తిస్థాయి సీఎం హోదాలో అధికారికంగా దేశ రాజధానిలో ఉదయాన్నే అడుగు పెట్టారు. చెన్నై నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆహ్వానం పలికారు. నేరుగా తమిళనాడు భవన్ కు చేరుకున్న పన్నీరు సెల్వం తొలిసారిగా, అక్కడ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సాయంత్రం వరకు అక్కడే విశ్రాంతి తీసుకున్న పన్నీరు ఐదు గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు రేస్ కోర్సు రోడ్డులోని ఇంటికి పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అలాగే, కొన్ని వినతి పత్రాలను సమర్పించారు. అందులోని కొన్ని ముఖ్య అంశాలను స్వయంగా పన్నీరు సెల్వం చదివి ప్రధానికి వినిపించారు. అరగంట పాటుగా సాగిన భేటీ అనంతరం వెలుపలికి వచ్చిన పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు.
ఆదుకోండి : వర్దా సృష్టించిన విలయం గురించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో ప్రదాని నరేంద్ర మోదీకి సమర్పించినట్టు పన్నీర్ సెల్వం వివరించారు. వర్దా బీభత్సంతో రూ.22,573 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దీని నుంచి గట్టెక్కేందుకు తమిళనాడును ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లను కేటాయించాలని కోరామన్నారు. 32ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఎన్నో రికార్డులను సృష్టించే రీతిలో సంక్షేమ పథకాలను ప్రజలకు తమ అమ్మ జయలలిత అందించారని గుర్తుచేశారు. దేశానికే కాదు, ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిన తమ అమ్మ జయలలితకు భారతరత్న ఇవ్వాలని, ఆమె నిలువెత్తు విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలని కోరినట్టు తెలిపారు.
దాటవేత : తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానితో చర్చించారా? అని ప్రశ్నించగా, దాటవేస్తూ, కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు పేర్కొన్నారు. తాము తీసుకున్న ముందస్తు చర్యలతో వర్దా రూపంలో ప్రజలకు భారీ నష్ట, కష్టాలు ఎదురుకాకుండా అడ్డుకోగలిగామన్నారు. అన్ని పరిశీలించి తమిళనాడును ఆదుకునే విధంగా ప్రధాని భరోసా ఇచ్చారన్నారు. ఇక, చిన్నమ్మ శశికళను సీఎం పదవిలో చూడాలని అన్నాడీఎంకే వర్గాలు ఆశ పడుతున్నట్టుందే అని మీడియా ప్రశ్నించగా, చిరునవ్వుతో సమాధానం దాట వేస్తూ ముందుకు కదిలారు. కాగా, ప్రధానితో భేటీ సందర్భంగా తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు, జల్లికట్టు వివాదం, కచ్చదీవుల వ్యవహారంతో పాటుగా, అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలపై కూడా చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి.