రైలుకోసం ఎయిర్పోర్ట్ గోడదూకి రన్ వే పైకి..
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భద్రతా విషయంలో డొల్లతనం కనిపించింది. ఎప్పుడూ డేగ కన్నేసి ఉంచే కేంద్ర బలగాలు, వాచ్ టవర్స్ కళ్లు గప్పి ఓ వ్యక్తి ఆ విమానాశ్రయం గోడ దూకాడు. అనంతరం రన్ వే వద్దకు వెళ్లి అరగంటపాటు కలియ తిరిగాడు. అతడి చేతిలో ఓ బ్యాగ్, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు 19, 20వ వాచ్ టవర్ గుర్తించిన తర్వాత గానీ బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే, అతడు వెళ్లింది రైలు కోసమంట.
ఇప్పటికీ ఊడీ ఉగ్రదాడితో భారత్ తీవ్ర ఆలోచనలో పడగా తాజాగా జరిగిన ఈ ఘటన మరోసారి అధికారులను కలవరంలో పెట్టింది. సాధారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ పెద్ద ఎత్తున ప్రహరీ గోడ, దానికి పైన ఇనుపముళ్ల కంచె ఉంటుంది. దాంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణ ఉంటుంది. మరోపక్క వాచ్ టవర్స్ కూడా ఎయిర్ పోర్ట్ ప్రాగణమంతా గమనిస్తుంటాయి.
ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి అసలు గోడ ఎలా ఎక్కాడు? రన్ వే వద్దకు వెళ్లే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేశారని ఉన్నతస్థాయి అధికారులు మండిపడుతున్నారు. ఎయిర్ పోర్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన సాగర్ జిల్లా వాసి సంగ్రామ్ సింగ్ గా గుర్తించారు. అతడిని ఢిల్లీ పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. తాను మధ్యప్రదేశ్ వెళ్లే రైలును క్యాచ్ చేసేందుకు వెళుతున్నానని అందుకే అడ్డుగా ఉన్న ఎయిర్ పోర్ట్ వాల్ దూకానని చెప్పినట్లు సమాచారం.