ప్రభుత్వ భూములకు రక్షణ
బంజర్, పోరంబోకు భూముల వద్ద బోర్డుల ఏర్పాటు
రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
విశాఖ రూరల్ : ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా, రక్షణ కల్పించాలని చెప్పి ఏడాది అవుతున్నా కొన్ని మండలాల్లో సర్వేలు నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు జాబ్ చార్ట్ విధిగా నిర్వర్తించాలని చెప్పారు. గ్రా మాల్లోని బంజర, పోరంబోకు భూములను గుర్తించి, అక్కడ ప్రభు త్వ భూమి అని బోర్డులు పెట్టాలని సూచించారు.
ఆర్ఐలు గ్రామాలను సందర్శించాలి
ప్రతీ నెలా ఆర్ఐలు గ్రామాలను సందర్శించి ఆక్రమణలపై పీరియాడికల్ రిపోర్టును పంపించాలని చెప్పారు. భూ ఆక్రమణలకు సంబంధించి పేపర్లలోను, నేరుగా ఫిర్యాదు వస్తే తప్పా ఆర్ఐలు ముందుగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను వసూలు చేయాలన్నారు. మండలాల వారీగా ప్రస్తుతం ఉన్నవి, కొత్తగా వేసిన లేఅవుట్ల సంబంధించి వివరాలను ఈ నెల 15లోగా సమర్పించాలని ఆదేశించారు.
‘భూ’ ఫిర్యాదులే ఎక్కువ
ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి భూ తగాదాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు తదితర సమస్యలపై పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయని జేసీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తహశీల్దార్ల కార్యాలయాల్లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సర్కారు భూముల రక్షణకు సర్వే పూర్తి చేసి అడంగల్ అప్ డేట్ చేయాలని సూచించారు. జమాబంది, నీటి తీరువా వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన వివరాలు ఈనెల 17లోగా సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినపుడు వీఆర్వో వద్ద సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఏజేసీ వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.