‘గాజా’ పోరు తీవ్రం
రంజాన్ రోజూ బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
గాజా: శాశ్వతంగా కాల్పుల విరమణను పాటించాలంటూ ఐక్యరాజ్య సమితి, అమెరికా చేసిన విజ్ఙప్తిని పెడచెవిన పెడుతూ.. ఇజ్రాయెల్, హమస్లు పరస్పర దాడులను తీవ్రం చేశాయి. గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకేరోజు 100 మందికి పైగా పాలస్తీనా వాసులు మరణించడంతో.. ఈ రంజాన్ గాజా ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. మరోవైపు, హమస్ దాడుల్లో 10 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా చనిపోయారు. మొత్తంమీద జూలై 8న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 251 మంది చిన్నారులు సహా 1,088 మంది పాలస్తీనా వాసులు చనిపోగా, 6,470 మంది గాయాలపాలయ్యారు. అలాగే, హమస్ దాడుల్లో ఈ మూడువారాల్లో 53 మంది ఇజ్రాయెల్ వాసులు కూడా మరణించారు. మంగళవారం నాటి ఇజ్రాయెల్ క్షిపణి దాడితో గాజాలోని ఏకైక విద్యుత్ ప్లాంటు ధ్వంసమైంది. గాజాలోని ఒక క్రీడాస్థలంపై జరిగిన ఒక క్షిపణి దాడిలో రంజాన్ పండుగ జరుపుకుంటున్న 9 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ దాడి చేసింది మీరంటే.. మీరంటూ ఇజ్రాయెల్, హమస్లు పరస్పరం ఆరోపణలకు దిగాయి.
హమస్కు ఆయుధాలందించండి: ఖొమేనీ
ఇజ్రాయెల్ సామూహిక జన హననానికి పాల్పడుతోందని, పాలస్తీనా వాసులకు ఆయుధ సహకారం అందించాలని ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా ఖొమేనీ ఇస్లామిక్ ప్రపంచానికి పిలుపునిచ్చారు. ‘ఇజ్రాయెల్ పిచ్చి కుక్కలా, అడవి తోడేలులా ప్రవర్తిస్తూ.. గాజాలో అమాయక జన హననానికి పాల్పడుతోంది’ అని రంజాన్ సందేశంలో ఆయన విమర్శించారు.