ఏపీలో శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థలం గుర్తింపు జరిగిన తరువాత దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలని, తద్వారా ముఖ్యమంత్రితో సంప్రదించి స్థల ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని తెలిపింది. హైకోర్టు విభజన పై ధన్గోపాల్రావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 1న తీర్పు వెలువరించింది. ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి పరస్పర సంప్రదింపులతో హైకోర్టు భవనం, పరిపాలన భవనం, న్యాయమూర్తుల, అధికారుల గృహ సముదాయాలు, హైకోర్టు సిబ్బంది క్వార్టర్లు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. మొత్తం ప్రక్రియ ఈ తీర్పు కాపీ అందుకున్న ఆరు నెలల్లోపు పూర్తి చేయాలి.నిధుల కేటాయింపుపై, కేటాయింపు జరిగిన తరువాత హైకోర్టు ఏర్పాటు కోసం వాటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
శాశ్వత హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు 1956 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 51 (3) ప్రకారం ఏపీలో తాత్కాలిక ప్రాతిపదికన హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేసే విషయంపై సీఎంతో చర్చించి, దీనిపై ప్రధాన న్యాయమూర్తి రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి.