గూడెంలో మరో యూనివర్సిటీ
- నేడు తన ప్రసంగంలో వెల్లడించనున్న గవర్నర్
- విమానాశ్రయ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పట్టాలు
- దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి.
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన శనివారం వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెం విమానాశ్రయ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పట్టాలు ఇచ్చే విషయమై శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు మంత్రి వెల్లడించారు.
సుమారు 150 ఎకరాల విస్తీర్ణంగల విమానాశ్రయ భూముల్లో వేలాదిమంది ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారని, వీరికి మునిసిపాలిటీ మౌలిక సదుపాయాలు కల్పిం చినా ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. వీటికోసం 30 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రికి నివేదించానని చెప్పారు. సమీపంలోని గన్నవరం, రాజమండ్రిలో విమానాశ్రయాలు ఉన్న దృష్ట్యా ఇక్కడ విమానాశ్రయం పునరుద్ధరించాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలను సావధానంగా విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
యూనివర్సిటీకి ఓకే!
తాడేపల్లిగూడెంలోని ఏయూ క్యాంపస్లో గోదావరి యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కోర్సులతో యూనివర్సిటీ రానుందని చెప్పారు. శనివారం నాడు గవర్నర్ ప్రసంగంలో తాడేపల్లిగూడెంలో యూనివర్సిటీ నెలకొల్పే అంశం ఉంటుందని తెలిపారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలో విద్యారంగానికి చెందిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.