నీటి పోరాటం...
చిక్కబళ్లాపురం : బయలు సీమ ప్రాంతాలకు శాశ్వత నీటి వనరులు కల్పించాలంటూ సోమవారం చిక్కబళ్లాపురంలో ఏడవ జాతీయరహదారిపై ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా శాశ్వత నీరావరి సమితి, జిల్లా రైతు సంఘం, మల్బరీ సమితి, ఒక్కలిగ సేనె, మహిళా సంఘటనల నేతృత్వంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. రైతులు తమ ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా శాశ్వత నీరావరి పోరాట సమితి అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.... బడ్జెట్లో ప్రభుత్వం నీరావరి ప్రాజెక్ట్ కోసం ఏ మాత్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఇప్పటికే బయలుసీమ జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి నీటిలో ఫ్లోరైడ్ శాతం గణనీయంగా పెరగడంతో తాగేందుకు సైతం పనికిరాకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బయలు సీమ జిల్లా వాసులను ఆదుకునేందుకు తక్షణం డాక్టర్ పరమశివయ్య నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒక్కలిగ సేనె రాష్ర్ట సంచాలకుడు యలువహళ్లి రమేష్, జిల్లా మల్బరీ సమితి అధ్యక్షుడు సొణ్ణేగౌడ, కరవే రాష్ర్ట సంచాలకుడు చలపతి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు భక్తరహళ్లి బైరేగౌడ, లక్ష్మిదేవమ్మ, రాధమ్మ, అంతర్జాతీయ అథ్లెట్ మంచనబలె శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.