ఆచితూచి అనుమతులు
- పరిశ్రమల చిత్తశుద్ధిపై లోతుగా కసరత్తు
- వడపోత తర్వాతే భూకేటాయింపులు
- నిర్మాణం పూర్తయ్యాకే సేల్ డీడ్ ఇచ్చేలా నిబంధన
- రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించకుంటే భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) ద్వారా పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరుస్తూనే పరిశ్రమలకు భూముల కేటాయింపులో పారదర్శకత కు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు భూకేటాయింపు ప్రక్రియ వివాదాస్పదమైన నేపథ్యంలో ఆచితూచి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.
పరిశ్రమల ఏర్పాటుకు పక్షం రోజుల్లోనే అనుమతులు ఇస్తామని సీఎం సహా అధికారులు ప్రకటించినా మెగా ప్రాజెక్టుల విషయంలో దరఖాస్తులను ప్రభుత్వం నిశితంగా పరిశీలించి వడపోయనుంది. పెట్టుబడిదారులతో సీఎం, పరిశ్రమలశాఖ అధికారులు సమావేశమై కంపెనీ శక్తి సామర్థ్యాలపై కసరత్తు చేయనున్నారు. కంపెనీల చిత్తశుద్ధిని అంచనా వేశాకే అనుమతులపై ముందడుగు వేయనున్నారు. దరఖాస్తుదారుడికి వాస్తవంగా ఎంత భూమి అవసరమనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సాంకేతిక నిపుణులతో కూడిన బృందం సమగ్ర ప్రాజెక్టు నివేదికను మదింపు చేయనుంది.
భూకేటాయింపు ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారుడు టీఎస్ఐఐసీతో ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే సంబంధిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తైఉత్పత్తి ప్రారంభించాకే ‘సేల్ డీడ్’ ఇవ్వనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అగ్రిమెంట్ ఆఫ్ సేల్‌ను ఏ సమయంలోనైనా రద్దు చేసేలా నిబంధన విధించనున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోనున్నారు. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ సబ్స్టేషన్లు, పోలీసు ఔట్‌పోస్టులు, ఫైర్ స్టేషన్లు, ఈ-సేవా కేంద్రాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు తదితర సౌకర్యాల కోసం కొంత భూమిని ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ భూముల కేటాయింపుల్లో పారదర్శకత కోసం మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు.
3 సంస్థల ద్వారా కేటాయింపులు
పెట్టుబడిదారులుకు పారదర్శకంగా భూకేటాయింపులు చేసే బాధ్యతను మూడు రకాల సంస్థలకు అప్పగించారు. రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి ఉండే మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) అనుమతులు ఇవ్వనుంది. రూ.5 కోట్ల పైబడి పెట్టుబడులు ఉండే పరిశ్రమలకు టీఎస్ఐఐసీ ఎండీ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి అలాట్మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) అనుమతులు మంజూరు చేయనుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ (డీఐపీసీ) అనుమతులు ఇవ్వనుంది.
ధరల నిర్ణయం టీఎస్‌ఐఐసీదే!
పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల ధరలను నిర్ణయించే బాధ్యత టీఎస్ఐఐసీ చేపట్టనుంది. ప్రభుత్వం గుర్తించిన పార్కుల్లో కాకుండా ప్రైవేటు భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారి కోసం భూసేకరణ చట్టం నిబంధనల మేరకు టీఎస్ఐఐసీ భూసేకరణ జరుపుతుంది. ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం...మౌలిక సౌకర్యాలు మాత్రం టీఎస్ఐఐసీ నిబంధనల మేరకు ఉండాలని స్పష్టం చేస్తోంది. భూవినియోగం, లేఔట్ అనుమతి, పర్యావరణ అనుమతుల వంటి బాధ్యతలన్నీ టీఎస్ఐఐసీకి అప్పగిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన 1.45 లక్షల ఎకరాలను గుర్తించి టీఎస్ఐఐసీకి రెవెన్యూశాఖ బదిలీ చేసింది.