నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి
నగరంలోని కబ్జారాయుళ్ల ఆట కట్టించడంతో పాటు అక్రమ నిర్మాణాలకు తావులేకుండా పటిష్ట చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమ నిర్మాణ దారులపై ఉక్కుపాదం మోపడమే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి వాటికి తావులేకుండా నిబంధనలు రూపొందించనున్నారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... నగరంలో ఇకపై ఎలాంటి నిర్మాణాలకైనా జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావాలన్నారు. పర్యావరణపరమైన అనుమతులు తప్పనిసరి చేసేందుకు నిబంధనలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
కబ్జాదారులను కఠినంగా శిక్షించేందుకు పటిష్టమైన చట్టాలు తెస్తామన్నారు. వాతావరణ సమతుల్యతకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. నగరంలోని 60 వేల ఎకరాల అటవీ భూములను గుర్తించి, అందమైన ఉద్యానవనాలుగా తీర్చిదిద్దాలన్నారు. పార్కులతో పాటు రిజర్వు ఫారెస్ట్, గ్రీన్‌ల్యాండ్స్ కబ్జారాయుళ్ల పాలవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బొటానికల్ గార్డెన్‌కు సైతం ఈ ముప్పు రాగా, స్థానికులు పోరాడి కాపాడుకున్నార ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు.
పార్కుల పరిరక్షణ కమిటీలు
పార్కుల స్థలాన్ని పరిరక్షించేందుకు, వాటిని వాతావరణ సమతుల్యాన్ని కాపాడే సాధనాలుగా మలచుకోవడానికి సిటిజన్ కమిటీలు నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఎన్నో నగరాలు తగిన స్థలం లేక కొట్టుమిట్టాడుతుండగా, హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని పెదవి విరిచారు. వాకర్లు, సైక్లిస్టులు, జాగింగ్ చేసేవారికి వేర్వేరు ట్రాక్‌లతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతామన్నారు. మూసీనది నుంచి వనస్థలిపురం వరకు వందల ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయని... అవి పార్కుల అభివృద్ధికి, చెట్లు పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఉందో పరిశీలించి, పార్కుల అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలిస్తానని చెప్పారు.