ప్రియుడితో కలిసి భర్త హత్య
వీడిన కేసు మిస్టరీ..
వేధిస్తున్నాడని చంపేసింది
కేసు వివరాలు వెల్లడించిన సీఐ వెంకట్రామయ్య
తాండూరు : వ్యక్తి హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనను వేధిస్తున్నాడని మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య శనివారం తన కార్యాలయంలో ఎస్ఐ చతుర్వేదితో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాత తాండూరు(మున్సిపల్ క్వార్టర్స్)కు చెందిన జెంతపాగ నాగరాజు(37), నాగలక్ష్మి దంపతులు.
నాగరాజు కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడు తరచూ మద్యం తాగుతూ భార్యను కొట్టేవాడు. నాగలక్ష్మికి మున్సిపల్ క్వార్టర్స్‌లో ఉంటున్న మున్సిపల్ కార్మికుడు బ్యాగరి వెంకటప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త వేధింపులను ఆమె వెంకటప్పతో మొరపెట్టుకునేది. ఈక్రమంలో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయాలని నాగలక్ష్మి పథకం వేసింది. ఈనెల 6న నాగలక్ష్మి వెంకటప్పకు రూ.3 వేలు ఇచ్చింది.
నాగరాజును వెంకటప్ప ఇంట్లోంచి తీసుకొని ఫూటుగా మద్యం తాగించి అర్ధరాత్రి సమయంలో తీసుకొచ్చి ఆరుబయట పడుకోబెట్టి వెళ్లాడు. అనంతరం నాగలక్ష్మి ప్రియుడితో కలిసి భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. ఇద్దరూ కలిసి నాగరాజు పురుషాంగాన్ని కత్తితో కోశారు. మరుసటి రోజు నాగరాజు హత్య విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొదటగా నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉండొచ్చని పోలీసులు భావించారు.
నాగలక్ష్మి, వెంకటప్పలపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరి బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకోణంలో పోలీసులు శనివారం వారిద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా హత్య నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.