రైల్వే టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్
విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌లైన్ : అధిక ధరలకు విక్రయించేందుకు రైల్వే రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసిన నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి ఆదివారం ఇన్చార్జి కోర్టులో హాజరుపరిచారు. వివరాల ప్రకారం.. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలోని పోస్టాఫీస్‌లో రైల్వే రిజర్వేషన్ సదుపాయం ఉంది. అదే గ్రామానికి చెందిన వేండ్ర శ్రీనివాసరావు (48), అతని కుమారులు అకిల్ వర్మతేజ (19), ధనుష్ తేజ (20) టికెట్లను వేర్వేరు పేర్లతో రిజర్వు చేయించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీరికి దనుకొండ వెంకటకృష్ణ (22) సహకరిస్తుంటాడు.
వీరిపై ఆర్పీఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ సిబ్బందికి గతంలో సమాచారం అందింది. శనివారం ఉదయం అందిన పక్కా సమాచారంతో వారు లంకలకోడేరులోని పోస్టాఫీస్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఈ నలుగురిని తనిఖీ చేసి, ఏడు రిజర్వేషన్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 9,730. వారిని అదుపులోకి తీసుకుని భీమవరం ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించారు. వేండ్ర శ్రీనివాసరావు నర్సపూర్‌లో రైల్వేస్టేషన్లో పార్సిల్ విభాగంలోని ప్రైవేట్ లీజుదారుల వద్ద పని చేస్తుంటాడు. ప్రయాణికుల అవసరాలను గుర్తించి టికెట్లను బుక్ చేస్తున్నట్టు వీరు విచారణలో తెలిపారు. ఈ మేరకు నమోదైన కేసులో నిందితులను అరెస్టు చేసి, ఆదివారం విజయవాడలోని ఇన్చార్జి కోర్టులో హాజరుపరిచారు. వీరికి రిమాండ్ విధించారు.