జరిమానా విధించారని ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
బలపాల(కురవి) : పంచాయతీ నిర్వహించిన పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్తాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని బలపాల గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుడి భార్య నర్మద కథనం ప్రకారం.. బలపాలలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఇరిగాల రాంమూర్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న అదే గ్రామానికి చెందిన కుక్కల వెంకన్న మానుకోటలో సిమెంట్ బస్తాలు కొనుగోలు చేసి రాంమూర్తి ఆటోలో వేసుకొని బయల్దేరాడు. బలపాలకు వస్తున్న క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో వెంకన్న కాలు విరిగింది. వెంటనే రాంమూర్తి హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్స కోసం రూ.3 వేలు ఖర్చు చేశాడు. అయితే ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ కావడంతో వెంకన్న పెద్ద మనుషులను ఆశ్రయించాడు. దీంతో పెద్దమనుషులు మంగళవారం గ్రామంలో కూర్చొని పంచాయతీ నిర్వహించారు. రూ.లక్ష పూచికత్తు పెట్టి పంచాయతీ చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే అంత మొత్తం డబ్బు లేకపోవడంతో రాంమూర్తి డిపాజిట్ పెట్టలేదు. డిపాజిట్ లేకుండా పంచాయతీ చేసిన పెద్దలు రాంమూర్తికి రూ.40 వేల జరిమానా విధించారు. ఇందులో ముందుగా రూ.10వేలు చెల్లించాలని నిర్ణయించారు. దీంతో ఇంట్లోకి వెళ్లిన రాంమూర్తి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరకపోవడంతోనే కక్ష గట్టిన పెద్దలు భారీ మెుత్తంలో జరిమానా విధించారని బాధితుడి భార్య నర్మద రోదిస్తూ తెలిపారు.