మార్మోగిన గోవింద నామస్మరణం
– వైభవంగా పేటవెంకటరమణ బ్రహ్మరథోత్సవం
– భక్తులతో కిటకిటలాడిన చిన్నమార్కెట్ ప్రాంతం
హిందూపురం అర్బన్ : వెంకటరమణ.. గోవింద.. గోవిందా.. అంటూ భక్తులు గోవింద నామస్మరణతో పట్టణంలోని పేటవెంటకరమణస్వామి ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో శుక్రవారం బ్రçహ్మరథోత్సవం కనులపండువగా అశేష జనవాహినీ మధ్య వైభవంగా సాగింది. ఉదయం మూలవిరాట్ వెంకటరమణస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి బంగారు కవచధారణతో విశేషపుష్పాలతో అలంకరణలు చేసి పూజలు చేశారు.
మధ్యాహ్నం మేళతాళాలు, భజంత్రీలతో కొల్లహపూరి ఆలయం నుంచి పట్టణ ప్రముఖులు, భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో తీసుకువచ్చి పూజలు జరిపారు. అలాగే రథోత్సవ చక్రాల దుంగలను యువకులు మోసుకుని గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టు ప్రాకారోత్సవం చేశారు. అనంతరం రథంపైకి ఉత్సవమూర్తులు చేరగానే వేలాదిభక్తులు కరతాళ ధ్వనులతో స్వాగతించారు.
అలాగే పట్టణ ప్రముఖులు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ జేపీకే రాము, ఈఓ శ్రీనివాసులుతో పాటు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి అశేష భక్తజనులు రథం లాగడంతో రథోత్సవం ముందుకు కదలింది. సాయంత్రం తిరిగి రథాన్ని ఆలయం వద్ద నుంచి ఐదులాంతర్ సర్కిల్ వరకు తీసుకువచ్చి అక్కడి నుంచి సింగర్చౌక్ వద్దకు తీసుకువెళ్లి నిలిపారు. రథోత్సవం సందర్భంగా స్థానిక మెయిన్ బజారులో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు, ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.